
హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి.
కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, అబిడ్స్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో ప్రజల ఆందోళన మరింత పెరిగింది.
ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్ల కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు తెలిపారు.
దేశంలో ఇంధన కొరత లేకున్నా బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. అసలు కారణమిదే..!

దేశంలో ఇంధన కొరత లేకున్నా, పుష్కలంగా నిల్వలు ఉన్నాసరే పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని బంకుల్లో ‘‘నో స్టాక్” బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కటిగా బంకులు మూతపడుతుండడం వాహనదారుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. దీంతో పెట్రోల్ బంకుల ముందు వాహనాలతో క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోనూ దాదాపు అన్నిచోట్లా బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఓవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో బంకులు మూతపడడంతో వాహనదారులు పానిక్ అవుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు బంకుల ముందు వాహనాలతో బారులు తీరుతున్నారు. అయితే, ఈ పరిస్థితికి ఆయిల్ కంపెనీలు అమలుచేస్తున్న కొత్త నిబంధనే కారణమని అధికారులు చెబుతున్నారు.
నగదు అడ్వాన్స్‌గా ఇస్తేనే ఇంధనం..
నిన్న మొన్నటి వరకు ఆయిల్ కంపెనీలు తమ రెగ్యులర్ కస్టమర్లు (బంకుల యాజమాన్యాలు, డీలర్లు) కు క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. ముందుగా ఇంధనం పంపించి ఆ తర్వాత డబ్బు వసూలు చేసుకునేవి. ఇప్పటివరకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు డీలర్లకు 3 నుంచి 5 రోజుల క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. దీనివల్ల డీలర్లు ఇంధనం తెప్పించుకున్న తర్వాత డబ్బు చెల్లించే వెసులుబాటు ఉండేది. కానీ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా కంపెనీలు ఈ క్రెడిట్ విధానాన్ని రద్దు చేశాయి. ఇకపై ఇంధనం కావాలంటే డీలర్లు ముందస్తుగానే నగదు చెల్లించాలని (అడ్వాన్స్ పేమెంట్) కొత్త నిబంధన విధించాయి.
నగదు చెల్లించలేక ఆర్డర్ చేయలేకపోతున్న డీలర్లు
ఈ మార్పుతో చాలా మంది డీలర్లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేక ఇంధనం కోసం ఆర్డర్లు పెట్టలేకపోయారు. దీంతో వారి వద్ద ఉన్న నిల్వలు అయిపోగానే బంకులను మూసివేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో బంకులు మూతపడుతున్నాయనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ట్యాంకులు ఫుల్ చేసుకోవడంతో పాటు క్యాన్లలోనూ ఇంధనం నింపుకోవడానికి ఎగబడటంతో ఉన్నచోట్ల కూడా డిమాండ్ అమాంతం పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.
డీలర్లు, ఆయిల్ కంపెనీల మధ్యే సమస్య..
ఈ విషయంపై స్పందించిన పౌరసరఫరాల శాఖ అధికారులు, రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇది కేవలం డీలర్లు, కంపెనీల మధ్య చెల్లింపుల సమస్య మాత్రమేనని, ప్రజలు భయపడి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. సరఫరా త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు.
అసోసియేషన్ వెల్లడించిన వాస్తవాలు:
- సరిపడా నిల్వలు: ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ (BPCL) వద్ద రాష్ట్ర అవసరాలకు మించి ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
- రద్దీ వల్లే సమస్య: ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడం, అందరూ ‘ఫుల్ ట్యాంక్’ చేయించుకోవడానికి మొగ్గు చూపడం వల్లే బంకుల్లో ఉన్న నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయి.
- తాత్కాలిక అంతరాయం: బంకుల్లో స్టాక్ అయిపోయిన తర్వాత, డిపోల నుంచి మళ్ళీ ట్యాంకర్లు వచ్చి నింపడానికి కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజలు దానిని శాశ్వత కొరతగా భావిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, కంటైనర్లు, కార్లు గంటల తరబడి క్యూలో ఉంటున్నాయి. “కొరత లేదు అని మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు, ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలనే ఆత్రుత వల్లే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడుతోంది” అని బంకుల యజమానులు వాపోతున్నారు.