పీసీసీ చీఫ్ రేవంత్ పై టీఆర్ యస్ నేతల భగ్గుభగ్గు..
కేసీఆర్ ను తిట్టడం ద్వారా రేవంత్ శునకానందం పొందారు: మంత్రి వేముల
రేవంత్ మాటలకు తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు: ఎమ్మెల్యే సైదిరెడ్డి
నిన్న ఇంద్రవెల్లి సభలో రేవంత్ ప్రసంగం
కేసీఆర్ పై విమర్శలు
తెలంగాణ మంత్రుల, ఎమ్మెల్యే ల ప్రెస్ మీట్స్
రేవంత్ పై నిప్పులు చెరిగిన వేముల,సైదిరెడ్డి
పగ, ప్రతీకారాలతో రేవంత్ రాజకీయం చేస్తున్నారు
కేసీఆర్ మాకు సంస్కారం నేర్పారు
లక్ష మందితో సభ పెట్టే సత్తా నాకు ఉంది సైదిరెడ్డి
ఇంద్రవెల్లి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను తీవ్ర పదజాలంతో విమర్శించడం పట్ల తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందించారు. వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నోటి తీట తీర్చుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ను తిట్టడం ద్వారా శునకానందం పొంది సభను ముగించారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఆయనను చూస్తుంటే తమకు జాలి కలుగుతోందని అన్నారు.
చంద్రబాబు భిక్షతోనే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాడని, రేవంత్ ఇప్పటికీ చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. శవాలపై పేలాలు ఏరుకునే రేవంత్ రెడ్డి, రోజుకో మాట, పూటకో పార్టీ మార్చుతుంటాడని, ప్రజలు ఆయనను ఏవిధంగా నమ్మాలని ప్రశ్నించారు.
1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డలను వందలమందిని పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, నాడు ఇందిరాగాంధీ హయాంలో ఈ ఘాతుకం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది నిన్న అదే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేయడం చూస్తుంటే గుండెలు మండాయని అన్నారు. ఆనాడు గిరిజనులను చంపి ఇవాళ స్మారకం కడతారా? అని వేముల మండిపడ్డారు.
రేవంత్ మాటలపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం తో ఉన్నారు.సైదిరెడ్డి…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారాలతో రాజకీయం చేస్తున్నారని… తాము కూడా అలాంటి రాజకీయాలనే చేస్తే ఆయన రోడ్డుపై తిరగ్గలడా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రశ్నించారు. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని… ఆయన మాటలకు తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నారని… ఇప్పుడేమో మహా దేవత అంటున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ కంటే ఎక్కువగా తాము మాట్లాడగలమని… అయితే తమ అధినేత కేసీఆర్ తమకు సంస్కారం నేర్పారని సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ లో లక్ష మందితో సభ పెట్టే సత్తా తనకు ఉందని… రేవంత్ రెడ్డి నిర్వహించిన ఇంద్రవెల్లి సభ తమకు ఒక లెక్కా? అని వ్యాఖ్యానించారు. రేవంత్ తనను తాను హైలైట్ చేసుకోవడానికే సభ పెట్టినట్టు ఉందని చెప్పారు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కాగానే… కాంగ్రెస్ లోని సీనియర్ నేతలందరూ బాధపడిపోతున్నారని అన్నారు.