బీసీలను బానిసలు అంటావా? క్షమాపణ చెప్పాల్సిందే: ఈటలపై ఎల్.రమణ ఫైర్!
-కేసీఆర్ బానిస గెల్లు శ్రీనివాస్ అని అన్నారు
-బీసీలను కించపరిచేలా మాట్లాడారు
-హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించాలి
హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్ ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే టీడీపీని వీడి, టీఆర్ఎస్ లో చేరిన ఎల్.రమణ కూడా ఈటలను టార్గెట్ చేశారు. ఆయన పై విరుచుక పడ్డారు. హుజురాబాద్ లో టీఆర్ యస్ అభుర్తిగా పోటీచేయబోతున్న గెల్లు శ్రీనివాస్ ను బానిస అంటూ ఈటల సంబోదించాడని బీసీలను బానిసలని అంటావా ? వెంటనే గెల్లు శ్రీనివాస్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో టీఆర్ యస్ అభ్యర్థిని భారీమెజార్టి తో గెలిపించాలని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ యస్ అధికారంలోకి వచ్చేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని రమణ అన్నారు.
బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారని… అయితే, కేసీఆర్ కు శ్రీనివాస్ బానిస అని ఈటల అనడం దారుణమని అన్నారు. బీసీలను ఈటల రాజేందర్ బానిసలు అంటున్నారని మండిపడ్డారు. బీసీలను కించపరిచేలా మాట్లాడిన ఈటల వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్.రమణకు జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రమణను సన్మానించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానని చెప్పారు.