ఈ కిరికిరిగాళ్లు, ఈ కొండెగాళ్లకు ఏంటి కడుపుమంట?: సీఎం కేసీఆర్!
-దళిత బంధు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం
-హుజూరాబాద్ లో ప్రారంభించిన సీఎం కేసీఆర్
-జై భీమ్ అంటూ ప్రసంగం షురూ
-రైతు బంధులా దళిత బంధు విజయవంతం అవుతుందని ధీమా
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ హుజూరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సభకు వచ్చిన దళిత సోదర సోదరీమణులందరికీ “జై భీమ్” అంటూ ప్రసంగం ప్రారంభించారు.
తాము ఇప్పటికే అమలు చేస్తున్న రైతు బంధు విజయవంతంగా నడుస్తోందని, రైతాంగంలో ఎంతో సంతోషం కనిపిస్తోందని అన్నారు. ఇప్పుడు దళిత బంధు అదే రీతిన విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళిత బంధు దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు.
ఇతర పార్టీలకు రాజకీయాలు అంటే ఓ క్రీడ అని, టీఆర్ఎస్ పార్టీకి మాత్రం సామాజిక అభివృద్ధే లక్ష్యమని స్పష్టం చేశారు. సామాజిక లక్ష్యాలను అందుకోవడం టీఆర్ఎస్ పార్టీకి పవిత్ర కర్తవ్యం అని, దళిత బంధును విజయవంతం చేయడంలోనూ అదే రీతిన కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎప్పుడైనా, ఎక్కడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కనీసం ఈ ఆలోచన వాళ్ల మదిలోకైనా వచ్చిందా? అని నిలదీశారు.
పిల్లి తన సంసారాన్ని చక్కదిద్దుకున్నట్టు నేను ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ వస్తున్నాను అని వివరించారు. వాస్తవానికి దళిత బంధు ఏడాది కిందటే ప్రారంభం కావాల్సి ఉందని, కరోనా వల్ల ఆలస్యం అయిందని వెల్లడించారు. తాను దళిత బంధు ప్రకటించానో లేదో కిరికిరిగాళ్లు, కొండెగాళ్లు ఒకరు కీ అంటే ఒకరు కా అంటే… ఒకడు ఇంత ఇవ్వాలంటే, ఇంకొకడు అంత ఇవ్వాలంటూ అందరూ దుకాణం మొదలుపెట్టారు అని విమర్శించారు. ‘ఏనాడూ ఐదు రూపాయలు ఇవ్వాలని మాట్లాడనివాడు కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు’ అంటూ వ్యాఖ్యానించారు.
“ఇంకొకడు మాట్లాడుతున్నాడు… ఎలా ఇస్తారో చెప్పాలె, ఎవరెవరికి ఇస్తారో చెప్పాలె అంటుండు. ఎందుకు చెప్పం… కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. ఎట్లా చెప్పాలో అట్లా చెబుతాం. నాకొకటి అర్థం కావడం లేదు… ఇచ్చేవాడు ఇస్తాడు, తీసుకునేవాడు తీసుకుంటాడు… మధ్యలో వాళ్లకు ఏంటి కడుపుమంట?” అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న దళితులకు కూడా దళితబంధు వర్తిస్తుంది: సీఎం కేసీఆర్
-హుజూరాబాద్ లో 21 వేల దళిత కుటుంబాలు
-అందరికీ దళితబంధు వర్తిస్తుందని వెల్లడి
హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆసక్తికర ప్రసంగం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్టు సర్వే చెబుతోందని, ఒకవేళ కొత్తగా పెళ్లిళ్లు జరిగుంటే మరికొన్ని కుటుంబాలు అదనంగా ఉండొచ్చేమోనని అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా… అందరికీ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉంది అని వ్యాఖ్యానించారు.
రాబోయే రెండు నెలల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి డబ్బులు ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. “ఎల్లయ్యకు ఇస్తారు, మల్లయ్యకు ఇవ్వరు అనే సమస్యే లేదు…. హుజూరాబాద్ లో అందరికీ ఇస్తారు. 25 ఏళ్ల కిందటే సిద్ధిపేట దళిత చైతన్య జ్యోతి అని దళిత బంధుకు అప్పుడే బీజం వేశాం. నేను అప్పుడు సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నాను. రసమయి బాలకిషన్ తో కలిసి అనేక పాటలు తీసుకువచ్చాం. నేను ఎమ్మెల్యే అయితే మొదటి సంతకంతో ఒక దళితుడికి మేలు చేయాలని భావించాను. నా క్లాస్ మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్ ను చేశాను. ఆయన ఇటీవలే కన్నుమూశారు.
దళితులను పైకి తీసుకురావాలన్న మా లక్ష్యం కొత్తదేమీ కాదు. చారి అని నాడు ఆంధ్రప్రభలో పనిచేసిన జర్నలిస్టుతో కలిసి ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులు ఎన్ని ఉన్నాయని అధ్యయనం చేశాం. మనదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురైన జాతులు ప్రపంచవ్యాప్తంగా 165 అని వెల్లడైంది. ఎలాంటి అవకాశాలు లేక అణగారి పోయారు. మన దేశంలో అంబేద్కర్ వల్ల కొందరు అభివృద్ధి సాధించారు. ఇంకా చాలామంది అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచిపోయారు.
హుజూరాబాద్ వంటి బాదులు ఇంకా చాలా ఉన్నాయి. రెండు నెలల్లో హుజూరాబాద్ అంతా దళితబంధు ఇస్తాం. అక్కడితో మీ పని అయిపోతుంది… నా పని మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ దళితబంధును ఇచ్చేందుకు నేను ఎంతో చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ దళిత బంధు ఎలా వస్తుంది? అంటున్నారు. రైతు బంధు తరహాలోనే దళితబంధు కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళితబంధు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం చివరి వరుసలో దళితబంధు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆకలితో ఉన్నవాళ్లకు, ఇల్లూ వాకిలీ లేని వాళ్లకు మొదటి వరుసలో, ఆ తర్వాత కొంచెం మెరుగ్గా ఉన్నవాళ్లు, చివరలో ఉద్యోగులు దళితబంధు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.