కాబూల్ లో కర్ఫ్యూ విధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ నిర్మానుష్యం!
-దేశాన్ని వీడి వెళ్లేందుకు ఆఫ్ఘన్ల ప్రయత్నాలు
-జనాలతో నిండిపోయిన కాబూల్ ఎయిర్ పోర్ట్
-ప్రజలను కట్టడి చేసేందుకు తాలిబన్ల కీలక నిర్ణయం
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తాలిబన్లు అత్యంత కఠినమైన షరియా చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాలిబన్ల పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో దేశాన్ని వదిలి వెళ్లేందుకు అక్కడి ప్రజలు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా కాబూల్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. వీలైనంత త్వరగా దేశాన్ని వీడిపోవాలనే ఆత్రుత కాబూల్ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్ట్ నిన్న ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో కాబూల్ లో గందరగోళ పరిస్థితులను నియంత్రించేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్ లో అధికారికంగా కర్ఫ్యూ విధించింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.
తాలిబన్ల చేతికి అమెరికా అత్యాధునిక ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు
కేవలం ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లతోనే ఆఫ్ఘనిస్థాన్ ను గజగజలాడించిన చరిత్ర తాలిబన్లది. ఇప్పుడు కూడా కేవలం ఈ ఆయుధాలతోనే ఆఫ్ఘన్ ను వారు చేజిక్కించుకున్నారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘనిస్థాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆయుధాలను వదిలేసి పలాయనం చిత్తగించారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల సొంతమయ్యాయి.
గత 20 ఏళ్లలో దాదాపు 89 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకులను, 11 వైమానిక స్థావరాలను ఆఫ్ఘనిస్థాన్ కు అమెరికా సమకూర్చింది. ఇవన్నీ ఇప్పుడు తాలిబన్ల వశమయ్యాయి. వీటిని ఉపయోగించడంలో ఆప్ఘన్ సైనికులకు అమెరికా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ… తాలిబన్లతో పోరాడలేక వారు పారిపోయారు. దాంతో గత రెండు దశాబ్దాలుగా అమెరికా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది.
తాలిబన్ల వశమైన ఆయుధ సంపత్తి వివరాలు:
ఏ-29 తేలికపాటి విమానాలు – 6
వేగంగా కదిలే బహుళ ప్రయోజన హమ్వీ వాహనాలు – 174
2.75 అంగుళాల హై ఎక్స్ ప్లోజివ్ రాకెట్లు (గగనతలం నుంచి భూతలంపై దాడికి ఉపయోగించే రాకెట్లు) – 10 వేలు
పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు – 9 లక్షలు
40 ఎంఎం హై ఎక్స్ ప్లోజివ్ తూటాలు – 60 వేలు
7.62 ఎంఎం తూటాలు – 20 లక్షలు
యూహెచ్ 60 బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు – 45
ఎండీ 530 హెలికాప్టర్లు- 50
ఎంఐ 17 హెలికాప్టర్లు – 56
ఏ 29 సూపర్ తుకానో ఫైటర్లు – 23
సి 130 హెర్క్యులస్ రవాణా విమానం – 1
సీ 208 విమానం – 1
మెత్తం మీద 211 విమానాలు, హెలికాప్టర్లకు గాను 167 పనిచేసే స్థితిలో ఉన్నాయి. అయితే, వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో తాలిబన్లకు అవగాహన లేదు. వీటికి పైలట్లు, టెక్నీషియన్లను గుర్తించడం తాలిబన్లకు కఠినమైన పరీక్షే. అంతేకాదు వీటి విడిభాగాలను సేకరించడం కూడా చాలా కష్టమైన పనే. అయితే ఈ కష్టాలను అధిగమిస్తే మాత్రం తాలిబన్లకు ఒక అత్యాధునికమైన వైమానిక దళం ఉన్నట్టే.
ఆఫ్ఘనిస్థాన్‌లో ఇక నాలాంటి అమ్మాయిలు బయటకు రాలేరు!: భారత్ లో ఉంటున్న ఆఫ్ఘన్ యువతి ఆవేదన
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతోన్న తీరుపై ఇతర దేశాల్లో ఉన్న ఆఫ్ఘన్ పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్‌లో తమ కుటుంబ సభ్యులను వారు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని చెప్పారు. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండాపోయిందని చెబుతున్నారు.
నాలుగేళ్లుగా భారత్‌లోని పంజాబ్, చండీగఢ్‌లో ఉంటోన్న ఆఫ్ఘన్ యువతి పర్వానా హుస్సేని (24) తాజాగా మీడియాతో మాట్లాడింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని బామ్యాన్ పట్టణంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఆ పట్టణాన్ని కూడా ఇటీవలే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా కలవడం లేదని ఆమె చెప్పింది. ఉగ్రవాదులు ఇళ్లలో ప్రవేశించి మహిళలను ఎత్తుకెళ్తున్నారని తెలిపింది.
ఇప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదని చెప్పింది. తాలిబన్ల రాజ్యం ఏర్పడుతుండడంతో ఇక తనలాంటి అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటకు రాలేరని వివరించింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు షరియా చట్టాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆఫ్ఘన్ విషయంలో భారత్‌తో పాటు అమెరికా, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నానని చెప్పింది.
తాలిబన్లతో నేడు భేటీ కానున్న రష్యా రాయబారి.. కీలక ప్రకటన వెలువడే అవకాశం
ఆప్ఘనిస్థాన్ లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు తాలిబన్ నేతలతో రష్యా రాయబారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఈ చర్చలు ఫలిస్తే ఆఫ్ఘనిస్థాన్ లోకి రష్యా మరోసారి ప్రవేశించే అవకాశం ఉంది.
వాస్తవానికి గతంలో కూడా ఆఫ్ఘన్లకు రష్యా సహకారం అందించింది. 1979 ప్రాంతంలో ఆఫ్ఘన్ కు రష్యా అండగా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పటి సోవియట్ యూనియన్ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యన్ బలగాలు వెనక్కి మళ్లాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్ఘన్ కు సహకారం అందించేందుకు రష్యా ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు తాలిబన్లకు సహకరిస్తామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రష్యా రాయబారి భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ చేయూత.. కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానం ప్రకటన
తాలిబన్లు అధికారంలోకి రావడంతో ఆందోళనకు గురవుతోన్న ఆఫ్ఘనిస్థాన్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్లు ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆ దేశ ప్రజలు కొందరు విదేశాలకు వలస పోవాలని ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు భారత్ కు రావడానికి వీలుగా కేంద్ర సర్కారు కొత్త ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని ప్రకటించింది.
భారత్‌లో ఆఫ్ఘన్ వాసుల ప్రవేశం కోసం వచ్చే దరఖాస్తులను వీలైనంత త్వరగా ఈ విధానం ద్వారా పూర్తి చేస్తారు. ఈ-ఎమర్జెన్సీ ఎక్స్ మిస్క్ వీసా ద్వారా వారికి వీసాలు ఇవ్వనున్నట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ప్రకటన చేసింది. కాగా, ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ తీసుకొస్తోన్న విషయం తెలిసిందే. ఆ దేశంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.