గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు!
-కనిపించకుండా పోయిన మహిళ ఆచూకీ లభ్యం
-సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు
-ఇష్టపూర్వకంగానే అతడితో వెళ్లినట్టు గుర్తింపు!
-ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గాంధీ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలపై కూపీలాగిన పోలీసులకు అసలు విషయాలు తెలిసి నివ్వెరపోయారు. ఒక మహిళా తప్పిపోవడం ఎవరో తీసుకోని పోయారని ఫిర్యాదు తో దర్యాప్తు జరిపిన పోలీసులకు విస్తు పోయే నిజాలు తెలిశాయి. వివరాల్లోకి వెళ్ళితే …..
గాంధీ ఆసుపత్రిలో అత్యాచార ఘటన కేసు ఓ కొలిక్కి వచ్చింది. నాలుగు రోజుల సస్పెన్స్ కు దాదాపు తెరపడినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఆచూకీ లేకుండా పోయిన మరో మహిళ జాడను పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించినట్టు సమాచారం. ఆమె బాగానే ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఇష్టపూర్వకంగానే ఆ మహిళ ఓ వ్యక్తితో వెళ్లిందని, అతడితో రెండు రోజుల పాటు ఉందని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఆ వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. మత్తు మందిచ్చి తమపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి మాటల్లో నిజం లేదని సమాచారం. వారిపై ఎలాంటి మత్తు మందు ప్రయోగం జరగలేదని వైద్యుల నివేదిక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈనెల 5న మూత్రపిండాల జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని మహబూబ్ నగర్ నుంచి అతడి భార్య, ఆమె సోదరి తీసుకువచ్చారు. ఆ క్రమంలోనే తనను, తన అక్కను మత్తిచ్చి ఆసుపత్రి సిబ్బంది రేప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వారి ఊర్లో పోలీసులు స్థానికులను విచారణ చేయగా.. వారికి కల్లు తాగే అలవాటుందని, మద్యం మానేయడం వల్ల వచ్చే లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. స్థానిక ఆర్ఎంపీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
దీంతో బాధితురాలిని పోలీసులు బుధవారం రహస్యంగా విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆసుపత్రిలో చేర్చి అప్పటికే ఐదు రోజులు కావడం.. మరోపక్క కల్లు లేకపోవడంతో బాధితురాలి అక్క పిచ్చెక్కినట్టు ప్రవర్తించిందని అంటున్నారు. దీంతో కల్లు కాంపౌండ్ గురించి తెలిసిన వ్యక్తితో కలిసి వెళ్లినట్టు తెలుస్తోందని చెబుతున్నారు.