ఎంటర్టైన్మెంట్ వార్తలు

విజయ్ ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురి అరెస్ట్

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల లీకేజీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రెండు రోజుల క్రితమే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీక్ కావడంపై నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పైరసీ వెనుక 21 మంది హస్తం ఉందని ఆరోపిస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆదివారం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ లీక్ నిర్మాణ సంస్థ నుంచే జరిగిందా లేక బయటి నుంచి హ్యాకింగ్ ద్వారా జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

‘జన నాయగన్’ చిత్రం విడుదలకు ముందే సెన్సార్ వివాదాల్లో చిక్కుకుంది. ఇందులో రాజకీయంగా సున్నితమైన అంశాలు, వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమా లీక్ కావడం నిర్మాతలకు మరింత నష్టాన్ని మిగిల్చింది.

ప్రస్తుతం ఈ లీక్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, పైరసీ లింకులను వెంటనే తొలగించాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించారు.

Related posts

నేను ఎక్కడికైనా వెళ్తా.. నా లైఫ్ నా ఇష్టం: హేమ

Ram Narayana

మనదీ ఒక బతుకేనా.. మనకంటే కాకి నయం: పూరి జగన్నాథ్!

Ram Narayana

సౌత్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్…

Ram Narayana