- తీవ్ర గాయాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
- ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో మాట్లాడటం కష్టంగా మారిన వైనం
- భవిష్యత్తులో ఆయన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని కథనం
- రహస్య లేఖల ద్వారా దేశాన్ని పాలిస్తున్నారని వెల్లడించిన ‘ది న్యూయార్క్ టైమ్స్’
- అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి.. కీలక నిర్ణయాలన్నీ వారే తీసుకుంటున్నారని వెల్లడి
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారు, స్పృహలోనే ఉన్నారు. కానీ ఓ దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. బయటి ప్రపంచానికి కనిపించకుండా, వినిపించకుండా పాలనలో చురుగ్గా ఉన్నప్పటికీ, దేశంలో అధికారం ఆయన చేతుల్లో నుంచి సైనిక జనరల్స్ వైపు మళ్లింది. ఈ సంచలన విషయాలను ‘ది న్యూయార్క్ టైమ్స్’ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది.
తీవ్ర గాయాలు.. రహస్య పాలన
పత్రిక కథనం ప్రకారం మొజ్తబా ఖమేనీకి తీవ్ర గాయాలైనప్పటికీ, ఆయన మానసికంగా చాలా చురుగ్గా ఉన్నారు. అయితే, ఆయన శరీరం తీవ్రంగా దెబ్బతింది. ఆయన కాలికి మూడుసార్లు ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం కృత్రిమ కాలు కోసం ఎదురుచూస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది. ఒక చేతికి కూడా శస్త్రచికిత్స జరగ్గా, అది నెమ్మదిగా కోలుకుంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా ముఖం, పెదవులు తీవ్రంగా కాలిపోవడంతో మాట్లాడటం కష్టంగా మారిందని, భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీ అవసరమని కథనం వివరించింది. ఈ గాయాల వల్లే ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. బలహీనంగా కనిపించడం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఆయనకు సందేశాలు చేరవేయడానికి, ఆయన నుంచి ఆదేశాలు స్వీకరించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. చేతితో రాసిన లేఖలను సీల్డ్ కవర్లలో ఉంచి, కార్లు, మోటార్‌సైకిళ్లపై మానవహారంలా ఒకరి నుంచి ఒకరికి అందిస్తూ ఆయన రహస్య స్థావరానికి చేరవేస్తున్నారు. ఇజ్రాయెల్ తమను గుర్తించి దాడి చేయొచ్చనే భయంతో సీనియర్ అధికారులు కూడా ఆయన్ను కలవడం లేదని రిపోర్ట్ తెలిపింది.
అధికారం జనరల్స్ చేతిలోకి..
ఖమేనీకి కమ్యూనికేషన్ పరిమితం కావడంతో, దేశంలో అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి వెళ్లింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్లు ఇప్పుడు యుద్ధం, దౌత్యం, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై పూర్తి పట్టు సాధించారు. “మొజ్తబా ఒక బోర్డు డైరెక్టర్‌లా వ్యవహరిస్తుంటే, జనరల్స్ బోర్డు సభ్యులుగా మారి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ సలహాదారు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ మార్పుతో దేశాధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వంటి పౌర నాయకులు కీలక నిర్ణయాల్లో నామమాత్రంగా మారారు. వారు కేవలం దేశీయ వ్యవహారాలకే పరిమితమయ్యారు.
అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పుడు చర్చలు వద్దని సైనిక కమాండర్లు వ్యతిరేకించడంతో, అమెరికాతో జరగాల్సిన చర్చలు కూడా విఫలమయ్యాయి. మొత్తంగా ఇరాన్‌లో పాలన మారనప్పటికీ, అధికారం ఒక వ్యక్తి చేతి నుంచి సైనిక కూటమి చేతికి బదిలీ అయిందని, వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని న్యూయార్క్ టైమ్స్ కథనం స్పష్టం చేసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: