జాతీయ రాజకీయ వార్తలు

గాలి పీల్చుకోవడానికి రాలేదు.. ఎవర్ని కలిశానో చెప్పను: సస్పెన్స్‌లో డీకే ఢిల్లీ పర్యటన

  • ఢిల్లీ పర్యటనలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
  • పార్టీ పెద్దలతో భేటీ వివరాలు చెప్పేందుకు నిరాకరణ
  • కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి వార్తల నడుమ ప్రాధాన్యం సంతరించుకున్న పర్యటన
  • బెంగళూరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు వెల్లడి

కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత అసమ్మతి సెగలు కొనసాగుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తాను కేవలం గాలి పీల్చుకోవడానికి ఢిల్లీకి రాలేదని, పార్టీ పెద్దలతో సమావేశమయ్యానని, అయితే ఆ వివరాలను వెల్లడించబోనని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

గురువారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఊహాగానాలపై స్పందించేందుకు నిరాకరించారు. “బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి విషయాలు మీడియా ముందు చర్చించలేను. దయచేసి నా నుంచి ఆ సమాచారం రాబట్టే ప్రయత్నం చేయవద్దు” అని అన్నారు. అలాగే తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల ప్రచారంపై పార్టీకి నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రికి సన్నిహితులైన మంత్రులు సమావేశమయ్యారన్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదని డీకే శివకుమార్ అన్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం కొందరు ఎమ్మెల్యేలు మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారన్న ప్రచారంపై ‘వేచి చూద్దాం’ అంటూ సమాధానం దాటవేశారు. ముస్లిం నేతల్లో ఉన్న అసంతృప్తిపై పార్టీ స్థాయిలో తమకు కొంత సమాచారం అందిందని, అందరం కలిసి పనిచేయాలని చెప్పారు.

తాను కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ వచ్చినట్లు తెలిపారు. బెంగళూరుకు సంబంధించిన కొన్ని అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించాల్సి ఉందని, శుక్రవారం ఉదయం 11:45 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీకి సమయం తీసుకున్నట్లు వెల్లడించారు. మైనారిటీ నేతల సస్పెన్షన్ రద్దు డిమాండ్‌పై స్పందిస్తూ.. “వారిని ఎవరు సస్పెండ్ చేశారు? వారే తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో ఏముందో పరిశీలించండి” అని డీకే వ్యాఖ్యానించారు.

Related posts

ఆమ్ ఆద్మీని ముంచేసిన ఆ రెండు కారణాలు..!

Ram Narayana

జేడీయూలో అధికారికంగా చేరిన నితీశ్ కుమార్ తనయుడు…

Ram Narayana

కూటమిలో కుదుపు: 243 స్థానాల్లోనూ ఆర్‌జేడీ పోటీ.. తేజస్వి సంచలన ప్రకటన!

Ram Narayana