Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆఫ్ఘ‌న్‌లో మీడియా పై తాలిబ‌న్ల ఆంక్ష‌లు…

ఆఫ్ఘ‌న్‌లో మీడియా పై తాలిబ‌న్ల ఆంక్ష‌లు
-తమకు ప్రతికూల వార్తలు ప్రసారం చేయవద్దని ఆదేశాలు
-ప్ర‌జ‌లంద‌రూ మేల్కొని తాలిబ‌న్ల‌పై పోరాడాల‌ని అహ్మద్‌ పిలుపు
-ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని తాలిబ‌న్ల ఆదేశం
-కీల‌క నేత‌లు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌కుండా కూడా ఆంక్ష‌లు
-అహమ్మద్ పిలుపుతో తాలిబన్లతో పోరాడేందుకు మహిళలు బయటకు వచ్చారు
-పాక్​ కు మరణ శిక్షే.. కాబూల్​ లో కదం తొక్కిన ఆఫ్ఘన్లు
-మహిళలు సహా గళమెత్తిన ప్రజలు
-మజారీ షరీఫ్ లోనూ నిరసనలు
-తాలిబన్లకు చావుతప్పదంటూ ఆగ్రహం
-ఇరాన్ లో పాక్ ఎంబసీ ముందు ఆందోళనలు

ఆఫ్ఘనిస్తాన్ లో మీడియా పై తాలిబన్లు ఆంక్షలు పెట్టారు .తమకు ప్రతికూల మైన వార్తలు రాస్తే శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీచేశారు. దీంతో బతుకు జీవుడా అంటూ క్షణమొక యుగంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కలం వెల్లదీస్తున్నారు . మరోపక్క పంజ్ షేర్ ను తాము వశం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటిస్తుండగా అలాంటిది ఏమి లేదని పంజ్ షేర్ నేత అహమ్మద్ మసూద్ ప్రకటించారు. పైగా తిరుగుబాటు చేయాలనీ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది రోడ్లపైకి వచ్చారని , ఇందులో మహిళలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారని రష్యన్ పత్రిక స్పుత్నిక్ వెల్లడించింది . తాలిబాన్లకు మద్దతు ప్రకటించిన పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు ఆఫ్ఘన్ మిన్నంటాయి.

ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, పంజ్‌షీర్‌లోని జాతీయ‌ ప్ర‌తిఘ‌ట‌న ద‌ళ‌ నాయకుడు అహ్మద్‌ మసూద్ మాత్రం తాలిబ‌న్ల ప్ర‌క‌ట‌న‌ను ఖండిస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

తుది శ్వాస విడిచేంతవరకు పంజ్‌షీర్‌ కోసం పోరాడుతూనే ఉంటాన‌ని, ప్ర‌జ‌లంద‌రూ మేల్కొని తాలిబ‌న్ల‌పై పోరాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో, అహ్మ‌ద్ ఇచ్చిన సందేశం ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌కుండా ఆఫ్ఘ‌న్ మీడియాపై తాలిబ‌న్లు ఆంక్ష‌లు పెట్టారు.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ మీడియా ఏజెన్సీ తెలిపింది. అంతేగాక‌, ఆఫ్ఘ‌న్ మాజీ అధ్య‌క్షుడు హమీద్ కర్జాయి, ఆఫ్ఘ‌న్ కీల‌క నేత, హెచ్‌సీఎన్ఆర్ మాజీ చైర్మ‌న్‌ అబ్దుల్లా అబ్దుల్లా ఆ దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వకుండా కూడా తాలిబ‌న్లు ఆంక్ష‌లు విధించారు.

నిన్న‌ ఫేస్‌బుక్‌లో అహ్మద్‌ మసూద్ ఓ వీడియో పోస్ట్ చేసి ఆఫ్ఘ‌న్ల‌లో చైత‌న్యాన్ని నింపేలా వ్యాఖ్య‌లు చేశారు. ఆఫ్ఘ‌న్ పౌరులు దేశం లోపల ఉన్నా, బయట ఉన్నా.. దేశ గౌరవం, స్వేచ్ఛ‌ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే దేశ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రాకుండా చేసేందుకు తాలిబ‌న్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఆప్ఘ‌నిస్థాన్‌లోని పంజ్‌షీర్‌ ప్రావిన్స్ మొత్తాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకున్నామ‌ని తాలిబ‌న్లు ప్ర‌క‌టన‌లు చేస్తుండ‌గా, ఇప్ప‌టికీ తాము పోరాడుతూనే ఉన్నామ‌ని మరోపక్క పంజ్‌షీర్ ప్ర‌తిఘ‌ట‌న ద‌ళాలు చెబుతున్నాయి.

తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లు రోడ్డెక్కుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్న పాకిస్థాన్ ను తిట్టిపోస్తున్నారు. కాబూల్, మజారీ షరీఫ్ నగరాల్లో మహిళలు సహా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన దళాలకు మద్దతుగా నిలిచారు. పంజ్ షీర్ కే తమ మద్దతు అని, తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు.

‘‘తాలిబన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్ కూ మరణ శిక్ష తప్పదంటూ నినదించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు ఇలా పదం కదిపి కదం తొక్కారు.

విదేశీ అరాచక శక్తులతో తాలిబన్లు చేతులు కలిపారని, దీనిపై దేశంలోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములంతా ఏకం కావాలని అహ్మద్ మసూద్ పిలుపునిచ్చారు. కాగా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని పాక్ రాయబార కార్యాలయం ముందు కూడా ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు నిరసన ప్రదర్శన చేశారు. ‘పాకిస్థాన్, తాలిబన్లకు మరణ శిక్ష’ అంటూ నినదించారు.

Related posts

దేవినేని ఉమ వాహనంపై రాళ్లదాడి… చంద్రబాబు పరామర్శ!

Drukpadam

వైయస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయం….ఢిల్లీలో బిజీ ,బిజీ …

Ram Narayana

నాపై దాడికి టీఆర్ యస్ కుట్ర …ఈటల అనుమానం ?

Drukpadam

Leave a Comment