టీఆర్ యస్ నాయకులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
-టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు డ్రగ్స్ వాడుతున్నారు
-గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారు
-బీజేపీ అధికారంలోకి రాగానే రక్త పరీక్షలను నిర్వహిస్తాం
-భాష విషయంలో కేసీఆరే నా గురువు
-తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం
-2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త చట్టం
-ఉత్తరప్రదేశ్ మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం
-‘ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు’ ఇదే మా నినాదం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని… భాష విషయంలో కేసీఆరే తన గురువని అన్నారు. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని… అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఓ నినాదాన్ని వినిపించారు. ‘ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం’ అని బండి సంజయ్ చెప్పారు. ఈ నినాదంతోనే తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
‘2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం’ అని బండి సంజయ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఈ రోజు పోస్ట్ చేశారు.
‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారు. బీజేపీ అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గారు. దమ్ముంటే బిల్లు పెట్టి చూడు. ఎక్కడ అడ్డుకోవాలో, అక్కడ అడ్డుకుని తీరుతాం’ అని బండి సంజయ్ హెచ్చరించారు.