బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు పడవలు.. పలువురు గల్లంతు
- -అసోంలో చోటుచేసుకున్న విషాదకర ఘటన
- -ప్రమాదం సమయంలో పడవల్లో 100 మందికి పైగా ప్రయాణికులు
- -ప్రమాదంలో ఒక పడవ మునక
బ్రహ్మపుత్ర నదిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అసోంలోని జోర్హత్ నిమతి ఘాట్ వద్ద రెండు పడవలు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అసోం రాజధాని గౌహతికి 350 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. ఒక పడవ మజులి నుంచి నిమతి ఘాట్ కు వస్తుండగా… మరో పడవ ఎదురుగా రావడంతో రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక పడవ మునిగిపోయింది.
మునిగిపోతున్న పడవ నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. పడవలోని మోటార్ బైకులు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. ఇప్పటి వరకు 40 మందిని కాపాడారు. మిగిలిన వారికోసం గాలింపు కొనసోగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మ స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని అన్నారు. తక్షణమే ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రి బిమల్ బోరాను ఆదేశించారు. రేపు తాను ఘటనా స్థలిని సందర్శిస్తానని చెప్పారు. అన్ని సహాయక చర్యలను చేపట్టాలని మజులి, జోర్హత్ జిల్లాల అధికారులను ఆదేశించారు.