ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై దుమారం!
-రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి టీడీపీ
-మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారు ధ్వజం
-రష్యా పర్యటన పూర్తిగా వ్యక్తిగతం …ఈ టూర్ లో టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు :బాలినేని
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ ఇప్పుడు రాజకీయ దుమారంగా మారింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రైవేట్ జెట్ విమానంలో విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయ విమర్శలకు కారణంగా మారింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పది మంది సన్నిహితులతో కలిసి రష్యా వెళ్లారు. ఆయన పర్యటన అధికారిక పర్యటనా, వ్యక్తిగత పర్యటనా అన్న చర్చ ఆయన పోస్ట్ చేసిన ఫోటోలతో మొదలైంది. అయితే బాలినేని రష్యా వెళ్లిన విమానం చాలా విలాసవంతమైన విమానం కావడంతో రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరుగుతున్నారని మంత్రి గారి పర్యటనను టార్గెట్ చేస్తోంది టిడిపి.
మంత్రి బాలినేని హవాలా కింగ్ అంటూ టీడీపీ ధ్వజం
సోషల్ మీడియా వేదికగా మంత్రి బాలినేని హవాలా కింగ్ అంటూ, అక్రమ సంపాదనతోనే మంత్రి బాలినేని ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతున్నాడు అంటూ తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది .వ్యక్తిగత ఫ్లైట్లో రష్యాకు వెళ్లడం అంటే సుమారు 5 కోట్ల మేర ఫ్లైట్ కే ఖర్చు అవుతుందని, ఏకంగా వ్యక్తిగతంగా ఒక ఫ్లైట్ నే బుక్ చేసుకున్నారు అంటే బాలినేని సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో నాయకులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, ప్రజలు తిరగడానికి గుంతల రోడ్లు అంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వానికి చురకలు వేస్తుంది. వైసిపి నాయకులు గాల్లో తప్ప కిందకు దిగటం లేదని పుట్టినరోజు వేడుకలు దగ్గర నుండి విదేశాల వెళ్లే వరకు కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ ఫ్లైట్ లలో జల్సాలు చేస్తున్నారని టీడీపీ నేతల నుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి :
టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా టూర్ పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఓ పక్కన అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్ లలో తిరగడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ సంపాదనతోనే , హవాలా సొమ్ముతోనే బాలినేని శ్రీనివాసరెడ్డి జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో సొంత కారు కూడా లేదని పేర్కొన్నారని కానీ ఇప్పుడు రష్యాకు ప్రైవేట్ ఫ్లైట్ లో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ ప్రయాణం చేశారని హవాలా కింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారు:
సీపీఐ నేత రామకృష్ణ సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా మంత్రి బాలినేని శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మంత్రులు విలాసాలలో మునిగి తేలుతున్నారని రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రుల తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బళ్లారి ఏరియాలో గాలి జనార్దన్ రెడ్డి ఏ విధంగా మైన్స్ ను కొల్లగొట్టాడో అదేవిధంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి అడ్డాగా మంత్రి బాలినేని గనులను కొల్లగొట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం నిత్యం అప్పులు చేస్తూ, ప్రజలపై రోజుకో రకమైన భారాలు మోపుతూ, రాష్ట్రం అప్పులపాలు అయిందని చెబుతుందని మండిపడ్డారు. ఇక మంత్రుల వ్యవహారశైలి ఈ విధంగా ఉందని అసహనం వ్యక్తం చేసిన సిపిఐ నేత రామకృష్ణ మంత్రుల జల్సాలపై ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
వ్యక్తిగతమని స్పందించిన బాలినేని ..
టీడీపీ ఎమ్మెల్యే కూడా తనతో ఉన్నాడని వ్యాఖ్యలు ఇక మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన రష్యా టూర్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పందించారు. రష్యా టూర్ తన వ్యక్తిగతమని,అధికారిక టూర్ కాదని, స్నేహితులతో కలిసి వచ్చానని ఆయన పేర్కొన్నారు. తనతో పాటు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. వ్యక్తిగత పర్యటనలపై రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ప్రతీది రాజకీయం చేయడం అలవాటు అయిందని విమర్శించారు.