‘రైతుల కోసం తెలుగుదేశం’ కార్యాచరణ ప్రకటించిన చంద్రబాబు
- రైతుల సమస్యలపై పోరాడాలని నిర్ణయం
- ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకమని వ్యాఖ్యలు
- టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
- సెప్టెంబరు 14 నుంచి జోన్ల వారీగా రైతుల కోసం
ఏపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం తెలుగుదేశం కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబరు 14 నుంచి 18వ తేదీ వరకు జోన్ల వారీగా రైతుల కోసం పోరాడాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 5 జోన్లలో ఒక్కోరోజు ఒక్కో జోన్ లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబరు 14న రాయలసీమ జోన్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు.
రైతులకు జగన్ వెన్నుపోటు పొడిచారని, రైతులకు ఇచ్చే సబ్సిడీలు నిలిచిపోయాయని, పెట్టుబడి వ్యయం రెట్టింపైందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితుల్లో కౌలు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.
ఈ భేటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ ముఖ్యనేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్, వర్ల రామయ్య, చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, బోండా ఉమ, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.