సామాన్య ప్రయాణికుడిలా బస్సెక్కి సిటీ బస్సు సేవలపై ఆరా తీసిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. గుర్తుపట్టని డ్రైవర్, కండక్టర్
-లక్డీకాపూల్ వద్ద బస్సెక్కిన సజ్జనార్
-సీబీఎస్‌లో దిగి ఎంజీబీఎస్ వరకు నడిచి వెళ్లిన ఎండీ
-ఇకపై బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించవన్న సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నిన్న సామాన్య ప్రయాణికుడిలా బస్సెక్కి సిటీ బస్సు సేవలపై ఆరా తీశారు. నిన్న ఉదయం లక్డీకాపూల్ బస్టాప్‌లో సామాన్య ప్రయాణికుడిలా నిలబడి గండిమైసమ్మ నుంచి సీబీఎస్ మీదుగా అఫ్జల్‌గంజ్ వెళ్లే బస్సు ఎక్కారు. సీబీఎస్‌లో దిగి ఎంజీబీఎస్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. దాదాపు మూడు గంటలపాటు బస్ స్టేషన్ అంతా తిరిగారు. స్టేషన్‌లోని మరుగుదొడ్లను పరిశీలించి దుర్వాసన రాకుండా చూడాలని సూచించారు.
హైదరాబాద్, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్‌తోపాటు ఎంజీబీఎస్‌లోని ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. సీబీఎస్‌లో దిగిన ప్రయాణికుల కోసం అక్కడి నుంచి ఎంజీబీఎస్ వరకు ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకపై ఆర్టీసీ బస్సులపై అశ్లీలంగా ఉండే సినిమా పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. కాగా, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ ఆయనను గుర్తించకపోవడం గమనార్హం.