Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం…

జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం
-కొత్తగా రెండు అభియోగపత్రాలు దాఖలు చేసిన ఈడీ
-నేటి విచారణలో జగన్‌కు మినహాయింపు ఇచ్చిన కోర్టు
-విజయసాయిరెడ్డి సహా పలువురు హాజరు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల ఈడీ దాఖలు చేసిన రెండు కొత్త అభియోగపత్రాలపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. నేటి విచారణకు హాజరయ్యే విషయంలో జగన్‌కు కోర్టు మినహాయింపునిచ్చింది. వాన్‌పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ కేసులో వైసీపీ నేత విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు విచారణకు హాజరయ్యారు.

ఈ కేసులో సమన్లు అందుకున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె. గీతారెడ్డి, పారిశ్రామిక వేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు బీపీ ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్, బ్రహ్మానంద రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. వాన్‌పిక్ కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు సమన్లు అందిందీ లేనిదీ చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణను అక్టోబరు 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే గృహనిర్మాణ ప్రాజెక్టులపై సీబీఐ కేసులో పేర్కొన్న అభియోగాలపై వాదనలు వినిపించాలని టీటీడీ ఛైర్మన్ వై. వి. సుబ్బారెడ్డిని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇదే కేసులో మరో నిందితుడు జితేంద్ర వీర్వానిపై జరగాల్సిన విచారణపై హైకోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. అదే సమయంలో సుబ్బారెడ్డి క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని చెప్పారు.

ఇదిలా వుండగా సీబీఐ కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ మరోసారి గడువు కోరింది. ఎమ్మార్ ఈడీ కేసుపై కూడా సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అలాగే ఎమ్మార్ కేసులో కోనేరు ప్రదీప్ పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై విచారణ జరుగుతోందని కోర్టుకు ఈడీ వివరించింది. మిగతా నిందితులపై దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

Related posts

నేరానికి ముందునాటి పరిస్థితిని తీసుకురాలేం.. మానసిక భద్రత మాత్రం కల్పించగలం: ఢిల్లీ హైకోర్టు

Drukpadam

రేపు నిర‌స‌న‌ల‌తో హోరెత్తించండి.. టీఆర్ఎస్ శ్రేణుల‌కు కేసీఆర్ పిలుపు

Drukpadam

Financial Firm TD Ameritrade Launches Chatbot For Facebook

Drukpadam

Leave a Comment