Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సెటైరికల్ ప్రెస్ మీట్…ఆద్యంతం ఆశక్తి …

పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సెటైరికల్ ప్రెస్ మీట్…ఆద్యంతం ఆశక్తి …
-పవన్ నాయుడు, మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం… చౌదరి గారూ మధ్యలో మీరెందుకు దూరిపోతారు
-ప్రశ్నించిన విలేకరిపై సెటైర్
-పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
-పవన్ మావాడే అంటూ వ్యంగ్యం
-ఓవైపు విమర్శలు, మరోవైపు సెటైర్లతో విరుచుకుపడిన నాని

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా, ఓ రిపోర్టర్ అందుకుని మిమ్మల్ని పవన్ కల్యాణ్ సన్నాసి అన్నాడు కదా అని ప్రశ్నించారు. దానికి పేర్ని నాని బదులిస్తూ… పవన్ నాయుడు నన్ను సన్నాసి అన్నాడా? అయినా మేం చుట్టాలం, ఒకే కులపోళ్లం, సన్నాసి, దద్దమ్మ అనుకుంటాం, అరే ఓరే అనుకుంటాం, వాడు వీడు అనుకుంటాం అందులో తప్పేమీ లేదులే చౌదరి గారూ, మధ్యలో మీరెందుకు దూరతారు అంటూ సదరు రిపోర్టర్ కు స్పష్టం చేశారు.

“నేను కాపునే. నేను సన్నాసిని అయితే పవన్ కల్యాణ్ గాడు కూడా సన్నాసే అవుతాడు కదా. వాడు పవన్ కల్యాణ్ గాడు సన్నాసిన్నర సన్నాసి. మావాడు తెగ మాట్లాడుతున్నాడు. చుట్టాలం కాబట్టి ఇక దాయడం ఎందుకు” అంటూ పవన్ ను ఏకవచన సంబోధనతో పేర్ని నాని తూర్పారబట్టారు.

“వాడు, మేం అంతా ఒకటే, అంతా ఆ తానులో ముక్కలం. ఇవాళ సాయితేజ్ యాక్సిడెంట్ గురించి కూడా మా వెధవన్నర వెధవ మాట్లాడాడు. మీడియాదే తప్పు అని మాట్లాడాడు. మీడియాకు బుద్ధి ఉందా అని అడిగాడు. ధైర్యం ఉందా అని మీడియాను కూడా అడిగాడు. మీడియాను కూడా సన్నాసుల్లారా అన్నాడు.

సాయితేజ్ కు యాక్సిడెంట్ రోజున అసలేం జరిగింది, మీడియా ఏంచెప్పింది? ఈ ఘటనలో అసలు గుండెకాయ లేనిది ఎవరికి మీడియాకా, మా పీకే గాడికా? తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో నాడు మీడియా కూడా అదే చెప్పింది. దీంట్లో ఎవర్ని తప్పుబట్టాలి? నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ విషయంలో తెలంగాణ పోలీసులను తిట్టాలి, లేకపోతే సీఎం కేసీఆర్ ను తిట్టాలి. ఏమైపోయాయి నీ దమ్ము, ధైర్యం. అవేవీ నీలో లేవా? లోపలికి వెళ్లిపోయాయా? సీఎం జగన్ మాత్రం నీకు లోకువ అయ్యాడా?

కేసీఆర్ ను సన్నాసి, వెధవ, లుచ్ఛా అని తిట్టలేవా? కేసీఆర్ ను తిట్టాలంటే గజగజ వణికిపోతాడని, ప్యాంట్లో కారిపోతాయని అందరికీ తెలుసు. తెరమీద అయితే ఎన్ని డైలాగులు చెప్పినా ఎవరూ ఎదురు పలకరు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ వైఎస్సార్ కాంగ్రెస్ అంటున్నావు… కానీ ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. కాబట్టే నువ్వు ఏది పిచ్చవాగుడు వాగినా చెలామణీ అవుతోంది.

నాన్నా పీకే.. నా మాటలు నువ్వు వింటున్నావని నాకు తెలుసు. ఎందుకంటే నాకు పెద్ద ఫ్యాన్ వని నాకు తెలుసు. నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటువి నువ్వు. వకీల్ సాబ్ సినిమాను ఆపేసుకుని మరీ బందరు వచ్చి నన్ను తిట్టావు. నీ మనసంతా నేను ఉన్నట్టుంది. ఏరా పీకే… శుంఠన్నర శుంఠా… ఏ పాపం తెలియని మీడియాను తప్పుబడతావా? నీకు ఖలేజా ఉంటే తెలంగాణ పోలీసులనో, కేసీఆర్ నో తిట్టుకో.

సాయితేజ్ మంచి కుర్రాడు, త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ సహా మేమందరం ఆకాంక్షిస్తున్నాం. సీఎం జగన్ కోడికత్తి కేసు ఏమైందో రాసుకోండ్రా అంటూ మీడియాకు చెబుతున్నారు. అరే బాబూ… కోడికత్తి కేసు ఎన్ఐఏ చూస్తోంది. నీకు ఒంట్లో ఏమైనా ఉంటే వెళ్లి అమిత్ షాను అడుగు. కోడికత్తి కేసు ఏమైందో ఆయన చెబుతారు. అక్కడ అడిగే దమ్ములేదు కానీ, ఇక్కడ మాత్రం సినిమా చూపిస్తున్నారు. నీ మాటలకు ఏంచెప్పాల్రా… మావాడు పిరికి సన్నాసి అని చెప్పమంటావా?” అంటూ నిప్పులు చెరిగారు.

దిల్ రాజు గారూ… మీరు రెడ్లు అని ఇప్పటివరకు నాకు తెలియదు: పేర్ని నాని

రిపబ్లిక్ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి, దిల్ రాజు రెడ్డి అంటూ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఘాటైన పదజాలంతో స్పందించారు. “దిల్ రాజు గారూ మీరు రెడ్లు అని నాకు తెలియదు. మీరు రాజులే అనుకున్నాను. మా జగన్ కూడా మీరు రాజులే అనుకుని మిమ్మల్ని బాగా ఏడిపిస్తున్నట్టున్నారు. నువ్వు రెడ్డి అని చెప్పవయ్యా… నీకు ఫేవర్ గా ఉంటాడు… అంటూ మావాడు నిన్న రిపబ్లిక్ ఈవెంట్లో అంటుంటే పాపం దిల్ రాజు రెడ్డి బిక్కచచ్చిపోయాడు. మా పవన్ గాడు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే రాజు గారి ముఖం ఏడవలేక నవ్వుతున్నట్టుంది. ఆయన బాధలు ఆయనవి.

దొంగ బాధకంటే లింగ బాధ పడలేకపోతున్నామన్నట్టుగా ఉంది. దొంగను తరుముతూ వెళుతుంటే మెడలో కట్టుకున్న లింగం గుండెలపై కొట్టుకుంటుంటే దొంగ బాధ కంటే లింగ బాధ ఎక్కువగా ఉందని బాధపడ్డాడట వెనకటికి ఎవడో. దిల్ రాజు రెడ్డి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సినిమా టికెట్లు, నిబంధనల సంగతేమో కానీ ఈ పీకే గాడు లింగంలా తయారయ్యాడని దిల్ రాజు రెడ్డి అనుకుంటున్నట్టుంది. నిన్న ఆయన ముఖం చూస్తే ఆముదం తాగినట్టుగా అనిపించింది” అంటూ వ్యంగ్యం కురిపించారు.

“ఇక, వకీల్ సాబ్ సినిమా ఆపేశారని చెబుతున్నారు. వకీల్ సాబ్ చిత్రంపై దిల్ రాజు రెడ్డి గారికి తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్ల షేర్ వచ్చింది. అందులో ఏపీ వాటా రూ.55.60 కోట్లు అయితే, తెలంగాణలో వచ్చింది రూ.25.37 కోట్లు. ఏరా దిక్కుమాలిన వెధవా… ఎందుకీ తప్పుడు మాటలు? ఒక్కరోజన్నా దిల్ రాజు రెడ్డి గారిని టీకి పిలిచి నాకు ఎంత ఇచ్చావ్ నీకు ఎంతయింది, నీకు ఎంతొచ్చింది అని అడిగితే లెక్క చెబుతాడు కదా. వకీల్ సాబ్ ను సీఎం జగన్ అడ్డుకుంటే ఇన్ని కోట్ల షేర్ ఎలా వచ్చింది?” అని పేర్ని నాని మండిపడ్డారు.

Related posts

థాకరే వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఘాటు స్పందన…

Drukpadam

రేపు ప్రధానితో కశ్మీర్‌ నేతల భేటీ: లోయలో భద్రత కట్టుదిట్టం…

Drukpadam

చంద్రబాబు కుట్రలో భాగమే రాష్ట్రపతికి లేఖ :ఎంపీ మిధున్ రెడ్డి…

Drukpadam

Leave a Comment