- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు
- కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ కుటుంబ సభ్యులు
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి నందమూరి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. నటుడిగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తన సుదీర్ఘ కెరీర్‌లో వందకు పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ యువ కథానాయకులకు దీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తాను చాటుకుంటున్నారు. మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు, పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రలలో కూడా తనదైన నటనతో మెప్పించారు. గతంలో కూడా ఆయన అనేక ఫిలింఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: