ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించిన న్యాయవాది.. సుప్రీంకోర్టులో అరుదైన ఘటన!
- -ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల కేసు విచారణ సందర్భంగా ఘటన
- -న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నట్టు స్క్రీన్‌పై కనిపించిన వైనం
- -ఆరా తీసి, పరామర్శించిన జస్టిస్ నాగేశ్వరరావు
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో పిటిషనర్ తరపు న్యాయవాది ఆసుపత్రి నుంచే వాదనలు వినిపించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వర్చువల్ విధానంలోనే సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాగా, ఎస్సీ, ఎస్టీ పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన కేసు తుది దశకు చేరుకోగా, జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవయ్‌లతో కూడిన ధర్మాసనం నిన్న విచారణకు సిద్ధమైంది.
అయితే, అదే సమయంలో ఈ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నట్టు స్క్రీన్‌పై కనిపించింది. ఆయన తన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. జస్టిస్ నాగేశ్వరరావు కల్పించుకుని ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పాలని ఆరా తీసి పరామర్శించారు.