Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

“మా” కు ప్రకాష్ రాజ్ రాజీనామా ….వద్దు అంకుల్ అని వారించిన విష్ణు…

“మా” కు ప్రకాష్ రాజ్ రాజీనామా ….వద్దు అంకుల్ అని వారించిన విష్ణు..
నాకంటూ ఒక ఆత్మ‌గౌర‌వం ఉంటుంది.. అందుకే రాజీనామా చేస్తున్నా: ప్ర‌కాశ్ రాజ్
అంకుల్… మీ నిర్ణయం నాకు నచ్చలేదు రాజీనామా నిర్ణయం వెనక్కు తీసుకోండి :విష్ణు
ప్రాంతీయ వాదం, జాతీయ‌వాదం తెర‌పైకి వచ్చాయి
తెలుగు బిడ్డ‌ను మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు
నేను తెలుగు బిడ్డ‌ను కాదు.. అది నా త‌ప్పు కాదు
ఓ అతిథిగానే వుండమన్నారు, అలాగే ఉంటా ప్రకాష్ రాజ్
తన రాజీనామా ఆమోదించాలని విష్ణుకు ప్రకాష్ రాజ్ సందేశం
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాగబాబు మా కు గుడ్ బై
ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన
అలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదన్న నాగబాబు

ఎన్నిలకల్లో గెలుపోటములు సహజం …. ప్రకాష్ రాజ్ “మా” అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అధ్యక్షుడు కావాలని సుమారు 300 మంది సభ్యులు కోరుకున్నారు. ఆయన కు గట్టి మద్దతు లభించినప్పటికీ ఓటమి చెందారు . అయినప్పటికీ తనను ఓ అతిధిగానే ఉండమన్నారని ,నేను తెలుగు బిడ్డను కాదని , ప్రాంతీయ వాదం ,జాతీయవాదం తెరపైకి వచ్చాయని , అందువల్ల తాను మా కు రాజీనామా చేస్తున్నాని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. దీనిపై నూతన “మా ” అధ్యక్షుడిగా ఎన్నిలకైనా మంచు విష్ణు స్పందించారు. అంకుల్ తొందరపడి రాజీనామా చేయవద్దని వేడుకున్నారు. మిమ్ములను కలిసి అన్ని విషయాలు మాట్లాడతామని అన్నారు. నిన్ననే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రకాష్ రాజ్ కు గట్టి మద్దతు ప్రకటించిన నాగబాబు “మా” కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రకాష్ రాజ్ రాజీనామా …. 

 

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించడం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు టెలిగ్రామ్ యాప్ ద్వారా తెలియజేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు. ‘మా’ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ మంచు విష్ణును అభినందించారు. ‘మా’ను నడిపించేందుకు సకల శక్తులు ప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ‘మా’లో సభ్యుడ్ని కాకపోయినా తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా మద్దతు ఇస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

ప్రకాష్ రాజ్ రాజీనామా పై విష్ణు స్పందన ….

దీనిపై మంచు విష్ణు బదులిచ్చారు. తనకు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు.”మీరు నాకుంటే ఎంతో పెద్దవారు. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులా గెలుపోటములు ఉంటాయని మీకు తెలుసు. దీన్ని మనం ఒకేలా స్వీకరిద్దాం.

దయచేసి మీరు భావోద్వేగాలకు లోను కాకండి. మీరు మా కుటుంబంలో ఒక ముఖ్య భాగం. మీ ఆలోచనలు మాకు కావాలి, మనం కలిసి పనిచేయాల్సి ఉంది. మీరు ఇప్పుడు వెంటనే నాకు బదులు ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలో నేనే మిమ్మల్ని కలుస్తాను… అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐ లవ్యూ అంకుల్… దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు! మనం ఎప్పటికీ ఒక్కటే!” అంటూ మంచు విష్ణు స్పందించారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ స‌భ్య‌త్వానికి సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ రాజీనామా చేశారు. మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు చేతిలో ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న ఈ రోజు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు.

ప్రాంతీయ వాదం తెర‌పైకి వ‌చ్చింద‌ని ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. విశ్లేషించాల్సింది చాలా ఉంద‌ని, దానిపై చ‌ర్చిస్తాన‌ని ప్ర‌కాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా ఎన్నిక‌ల్లో చాలా మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని, వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నిక‌లు ప్రాంతీయ‌, జాతీయవాదం భావోద్వేగాల‌ మ‌ధ్య జ‌రిగాయ‌ని చెప్పుకొచ్చారు.

తెలుగు బిడ్డ‌ను మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నార‌ని చెప్పారు. తాను తెలుగు బిడ్డ‌ను కాద‌ని అన్నారు. మా ప్రాథమిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. త‌న త‌ల్లిదండ్రులు తెలుగువారు కాద‌ని, అది వారి త‌ప్పు కాద‌ని, త‌న త‌ప్పు కూడా కాద‌ని అన్నారు. తెలుగు వ్య‌క్తినే ఓట‌ర్లు ఎన్నుకున్నార‌ని తెలిపారు. అత‌డు మంచి వ్య‌క్తేన‌ని అన్నారు.

అయితే, ‘నాకంటూ ఒక ఆత్మ‌గౌర‌వం ఉంటుంది.. అందుకే ‘మా’కు రాజీనామా చేస్తున్నా’న‌ని తెలిపారు. త‌న‌కు, ప్రేక్ష‌కుల‌కు మ‌ధ్య అనుబంధం మాత్రం సినిమాలతో కొన‌సాగుతుంద‌ని చెప్పారు. త‌నను ఓ అతిథిగానే ఉండాల‌ని, అసోసియేష‌న్ స‌భ్యులు భావిస్తున్నార‌ని, అలాగే ఉంటానని అన్నారు.

నాగబాబు నిన్ననే రాజీనామా …..

హోరాహోరీగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించిన కాసేపటికే సీనియర్ నటుడు నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంకుచిత మనస్తత్వం, ప్రాంతీయవాదంతో కొట్టుమిట్టాడుతున్న మా అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజీనామా లేఖను 48 గంటల్లో ‘మా’ కార్యాలయానికి పంపుతానని పేర్కొన్నారు. ఆషామాషీగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని, పలు విధాలుగా ఆలోచించిన తర్వాత పూర్తి చిత్తశుద్ధితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాగబాబు తెలిపారు.

మా ఎన్నికలపై చిరంజీవి స్పందన …..

రోషన్ శ్రీలీల జంటగా నటించిన “పెళ్లిసందడి” చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. చిరంజీవి ప్రసంగిస్తూ, వెంకటేశ్ తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. తన సినిమా బాగుంటే వెంకటేశ్ అభినందిస్తాడని, వెంకటేశ్ సినిమా బాగుంటే “ఏంచేశావయ్యా వెంకీ” అని తాను అభినందిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా అని వ్యాఖ్యానించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. పదవుల కోసం అందరికీ లోకువ అయ్యేలా వ్యవహరిస్తున్నారని, ఒకరిని అనడం, అనిపించుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. తాను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించడంలేదని, ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. మన ఆధిపత్యం చూపించుకోవడానికి ఎదుటివారిని కించపర్చాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

అసలు చిత్ర పరిశ్రమలో వివాదం ఎక్కడ ప్రారంభమైందో అందరూ తెలుసుకోవాలని, ఆ వివాదం ప్రారంభించిన వ్యక్తిని గుర్తించాలని పేర్కొన్నారు. హోమియోపతి వైద్య విధానంలో మూలకారణాన్ని బట్టి చికిత్స చేస్తారని, ఇక్కడ అదే సూత్రం వర్తింపజేయాలని పిలుపునిచ్చారు. వివాదానికి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయాలన్నారు. చిన్న చిన్న గొడవలతో బజారుకెక్కి మీడియా వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని అన్నారు.

Related posts

ఏ హీరోలు నాకు లక్షలకి లక్షలు ఇవ్వలేదు..సీనియర్ నటి పావలా శ్యామల!

Drukpadam

రిపబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్ …ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్!

Drukpadam

చిరంజీవి సినీ కార్మికులకు అనవసర హామీలు ఇవ్వడం మానుకోవాలి: కోట శ్రీనివాసరావు!

Drukpadam

Leave a Comment