Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

‘మా’ ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పింది… చిరంజీవి!: మంచు విష్ణు సంచలనం…

నన్ను ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పింది… చిరంజీవి!: మంచు విష్ణు సంచలనం…
-మంచు విష్ణు ప్రెస్ మీట్
-ఎన్నికల ముందు పరిణామాలపై వివరణ
-ప్రకాశ్ రాజ్ ఏకగ్రీవానికి చిరు ప్రతిపాదించారని వెల్లడి
-తాము అంగీకరించలేదని విష్ణు స్పష్టీకరణ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకోమని చెప్పింది చిరంజీవేనని స్పష్టం చేశారు.

“మా నాన్న గారిని ఈ విషయంలో రిక్వెస్ట్ చేసింది ఎవరో చెప్పకూడదేమో కానీ, ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి చెబుతున్నా…. నన్ను సైడయిపోవాలని కోరింది చిరంజీవి అంకులే. ఎన్నికలు ఎందుకు… ప్రకాశ్ రాజ్ ను ఏకగ్రీవం చేద్దాం అని మా నాన్నకు చిరంజీవి అంకుల్ చెప్పారు. కానీ నేను తప్పుకోవాలని భావించలేదు. మా నాన్న నిర్ణయం కూడా అదే. ఎన్నిలకు వెళదామనే మేం నిర్ణయించుకున్నాం” అని వివరించారు.

అంతకుముందు రామ్ చరణ్ గురించి చెబుతూ మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ 99 శాతం ప్రకాశ్ రాజ్ కే ఓటేసి ఉంటాడని చెప్పగలనని, ఎందుకంటే చరణ్ తండ్రి మాట జవదాటడని అన్నారు. “నేను కూడా మా నాన్న మాటను పాటిస్తాను. చరణ్ కూడా అంతే. అందులో తప్పేమీలేదు. చరణ్ స్థానంలో నేనున్నా అదే చేస్తాను. ప్రకాశ్ రాజ్ కు ఓటేశాడని మా మధ్య అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదు. చరణ్ నాకు సోదరుడు” అని పేర్కొన్నారు.

 

ప్రకాశ్ రాజ్ వేరే భాషకు చెందిన వ్యక్తి అని, ఓటేయొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు: మంచు విష్ణు

Manchu Vishnu clarifies on his comments

మీడియా సమావేశంలో మంచు విష్ణు పలు అంశాలపై వివరణ ఇచ్చారు. తెలుగువాడే మా అధ్యక్షుడు అవ్వాలని తానెప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. తెలుగు కళామతల్లిని నమ్ముకున్నవాడే మా అధ్యక్షుడు అవ్వాలని, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పానని ఉద్ఘాటించారు.

“ప్రకాశ్ రాజ్ కి ఇవాళ కూడా చెబుతాను. ఆయన ఒక్క తెలుగు నటుడే కాదు, కన్నడలో నటిస్తారు, తమిళంలో నటిస్తారు, హిందీలో కూడా చేయొచ్చు. అయితే ఆయన ఏ భాషను నమ్ముకున్నాడో ఆ భాష చిత్ర పరిశ్రమలో ఆయన పోరాడాలి. ఆయన అన్ని భాషల్ని నమ్ముకున్నాడు. కానీ నేను నమ్ముకుంది ఒక్క తెలుగు భాషనే. తెలుగు కళామతల్లినే నేను నమ్ముకున్నాను. అదే చెప్పాను. అంతే తప్ప, ఆయన వేరే ఊరి నుంచి వచ్చాడు, ఆయనకు ఓటేయొద్దని ఎప్పుడూ చెప్పలేదు.

ఇది మా భాష అని, మా తెలుగు కళామతల్లి అని నమ్మే ప్రతి ఒక్కరూ ఇక్కడ పోటీ చేయొచ్చు. తమిళ నట దిగ్గజం శివాజీ గణేశన్ తనయుడు ప్రభుకు మా లో సభ్యత్వం ఉంది. రేపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి, శ్రీలంక నుంచి కూడా తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు రావొచ్చు. వారిందరికీ మాలో సభ్యత్వం ఉంటుంది” అని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

నాగబాబు రాజీనామా నేను ఆమోదించను: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మంచు విష్ణు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. తమ ప్యానెల్ ప్రమాణస్వీకారం తేదీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంపై స్పందిస్తూ, మా కుటుంబ పెద్దల్లో నాగబాబు ఒకరని స్పష్టం చేశారు.

ఆయన మనస్తాపం చెంది, ఆవేశంలో తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని తాను అధ్యక్షుడిగా ఆమోదించబోనని మంచు విష్ణు వెల్లడించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నిరాశ అందరికీ ఉంటుందని, త్వరలోనే నాగబాబును కలిసి, ఆయనతో మాట్లాడతానని తెలిపారు. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాపైనా తమ నిర్ణయం అదేనని వివరించారు.

ప్రకాశ్ రాజ్ ను తాను ఎంతో అభిమానిస్తానని, నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా తాము ఎంతో సన్నిహితంగా మెలిగామని, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని వివరించారు. ఆట మొదలైందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు కదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… మా అభివృద్ధి ఎలా చేయాలన్న ఆట ఇప్పుడే మొదలైందని, ప్రకాశ్ రాజ్ ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతామని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

గెలుపోటములు రెండూ మోసకారి అంశాలేనని, వీటిని హృదయంలోకి తీసుకోనని, ప్రకాశ్ రాజ్ అవసరం తమకు ఎంతో ఉందని స్పష్టం చేశారు. నాన్ లోకల్ అంశం ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణం అంటే తాను విశ్వసించబోనని పేర్కొన్నారు. 650కి పైగా ఓట్లు పోలైతే 265 మంది ప్రకాశ్ రాజ్ కు ఓటేశారని, వారందరూ ప్రకాశ్ రాజ్ కావాలని కోరుకున్నవారే కదా అని విష్ణు వివరించారు. ఇక నాన్ లోకల్ అంశం ఎక్కడ అని ప్రశ్నించారు.

Related posts

మా ఎన్నికలు ముగిసినా తగ్గని రాద్ధాంతం …

Drukpadam

అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు… హోరెత్తనున్న ప్రచారం !

Drukpadam

ఆర్జీవీ తలకు రూ. కోటి నజరానా.. టీవీ లైవ్ లో కొలికపూడి వ్యాఖ్యలు.. వర్మ పోలీస్ కంప్లైంట్

Ram Narayana

Leave a Comment