- మరికొన్నిరోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక
- ప్రత్యర్థి పార్టీలపై రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు
- టీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కులేదని వ్యాఖ్య
- కేసీఆర్, మోదీ తోడుదొంగలంటూ కామెంట్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తనకు, ఈటలకు పడడంలేదని హరీశ్ రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈటల, హరీశ్ రావు 20 ఏళ్లు జోడు గుర్రాల్లా కలిసి తిరిగారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ ఆరోపించారు.
అసలు ఈటల దేని కోసం కొట్లాడారని ప్రశ్నించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఇచ్చారో చెప్పాలంటూ హరీశ్ రావును నిలదీశారు. ఈటల అవినీతిపై విచారణ ఏమైందో కేటీఆర్ చెప్పాలన్నారు.
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని, హుజూరాబాద్ లో ఓట్లు అడిగే అర్హత టీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడుదొంగలేనని రేవంత్ వ్యాఖ్యానించారు. పెట్రో ధరలతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.