హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు . హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలకు సంబంధించి హన్మకొండలోని హరిత కాకతీయ లో మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని కిషన్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను ప్రలోభపెట్టటం కోసం మద్యం, డబ్బు ఏరులై పారుతుందని ఆరోపించారు.
తెలంగాణా కోసం పోరాడుతున్న వారు బీజేపీకే మద్దతు
తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని, హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొన కిషన్ రెడ్డి అందుకే టిఆర్ఎస్ నాయకులు అనేక అబద్ధాలు చెబుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్పు కోసం హుజురాబాద్ ప్రజలు బిజెపికి ఓటు వేయనున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ,కేసీఆర్ ,కేటీఆర్ లు తప్పుడు ప్రచారం వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారని దాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు.