Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ!

ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ….
-ఎఫ్‌సీఐ విధానాలతోనే గందరగోళం, చర్యలు తీసుకోండి
-తెలంగాణా ప్రభుత్వ పథకాల వల్ల సాగుబడిలో సత్ఫలితాలు
-రాష్ట్రం ఏర్పాటు కాక ముందు రైతన్నల పరిస్థితి, ఇప్పటి పరిస్థితి వివరించిన కేసీఆర్
-కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానన్న సీఎం కేసీఆర్

వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం చర్యలను నిరసిస్తూ గురువారం హైద్రాబాద్ ధర్నా చౌక్ లో కేసీఆర్ ధర్నా చేయనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కి లేక రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో, రైతన్నల నుండి ధాన్యం కొనుగోలు పై రగడ కొనసాగుతున్న తరుణంలో బీజేపీపై యుద్ధం చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ధాన్యం కొనుగోలుపై లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్సీఐ కి ఆదేశాలు ఇవ్వాలని మోడీకి సీఎం కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసీఆర్ మోడీకి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించిందని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల మూలంగా వ్యవసాయ రంగంలో ఇంతటి అభివృద్ధి సాధ్యం అయిందని పేర్కొన్న ఆయన, 24 గంటల పాటు నాణ్యమైన కరెంటునివ్వడమే కాకుండా ఏడాదికి ఎకరానికి పది వేల రూపాయల పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతులకు రాష్ట్రప్రభుత్వం అందిస్తుందని లేఖలో స్పష్టం చేశారు. కష్టజీవులైన తెలంగాణ రైతులు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను తీసుకుని గుణాత్మక దిగుబడిని సాధిస్తున్నారు అని, తద్వారా దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు అని సీఎం కేసీఆర్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని ఆయన లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే ఎక్కడ చూసినా తెలంగాణలో కరువుకాటకాలు తాండవించేవని, సాగునీటి వసతులు సరిగా లేక పంటలు సరిగా పండేవి కాదని పేర్కొన్న సీఎం కేసీఆర్ నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత కారణంగా తెలంగాణ రాష్ట్రం తమ అవసరాలను మించి ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందని స్పష్టం చేశారు. తెలంగాణా బంగారు పంటలను పండిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదని సీఎం కేసీఆర్ లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు.

ఇక ఇదే సమయంలో భారత ఆహార సంస్థ అసంబద్ధ విధానాలను అవలంభిస్తోందని, సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను పంపిణీ చేస్తూ, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన ఎఫ్‌సీఐ అటు రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కెసిఆర్ ఎఫ్సీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. భారత ఆహార సంస్థ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించటం లేదని, ప్రతియేటా ధాన్యం దిగుబడి పెరుగుతుందని తెలిసినా ధాన్యాన్ని సేకరించడం వేగవంతంగా చెయ్యటం లేదని, ఎస్బిఐ అనుసరించే అయోమయ విధానాల వల్లనే రాష్ట్రాలు, రైతులకు సరైన పంటల విధానాన్ని సూచించలేక పోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

2021 వానకాలం సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో 55 .75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందని అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే భారత ఆహార సంస్థ సేకరించిందని తెలిపారు. పండిన పంటలో కేవలం 59 శాతం మాత్రమే ధాన్యాన్ని ఇప్పటివరకు సేకరించింది అని పేర్కొన్నారు. ఇది ఖరీఫ్లో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువని పేర్కొన్నారు. ఇంత విపరీతమైన తేడాలు ఉంటే రాష్ట్రంలో సరైన పంట విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానన్న సీఎం కేసీఆర్ ఇలాంటి గందరగోళ పరిస్థితులు తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించారని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని సెప్టెంబర్ 25, 26 వ తారీఖులలో తానే స్వయంగా వెళ్లి కలిశాను అని పేర్కొన్నారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశానని కేసీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసి 50 రోజులు దాటినా ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదని కెసిఆర్ తన లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు.

ఇక ఇదే సమయంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా పేర్కొన్న సీఎం కేసీఆర్ 2020 2021 ఎండాకాలం సీజన్లో సేకరించ కుండా మిగిలి ఉంచిన ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో కూడా 2021- 2022 వానాకాలంలో పండిన పంటలో 90% వరి ధాన్యాన్ని సేకరించాలని తెలిపారు. నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం అనే నిబంధనను మరింతగా పెంచి ధాన్యం సేకరించాలని కేసీఆర్ మోడీకి విజ్ఞప్తి చేశారు .రాష్ట్రాల నుండి కొనుగోలు చేసే ధాన్యంపై ముందే ఎఫ్సిఐ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు . వచ్చే అసెంబ్లీ లో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం ఉంటుందో ముందుగానే నిర్ణయించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేశారు.

 

Related posts

లోకేష్ జూమ్ మీటింగ్ కు వైసీపీ బ్రేక్ …

Drukpadam

బెంగాల్‌లో హింస.. నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ…

Drukpadam

జులై 3 న హైద్రాబాద్ లో ప్రధాని మోడీ సభ …టార్గెట్ 10 లక్షలు…

Drukpadam

Leave a Comment