- గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని మా సభ్యులున్నారు
- దానిని చంద్రబాబు మరో డ్రామాలా మార్చేశారు
- వివేకానందరెడ్డిని వాళ్లే ఏదో చేసుంటారు
- చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు
ఏపీ అసెంబ్లీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తన భార్యను కూడా చర్చల్లోకి తీసుకొస్తున్నారంటూ తీవ్ర మనస్తాపానికి గురైన టీడీపీ అధినేత చంద్రబాబు… మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబసభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని అన్నారు. ఆయనే తన చిన్నాన్న, చెల్లెలు గురించి మాట్లాడారని చెప్పారు.
గతంలో జరిగిన హత్యలపై విచారణ జరగాలని తమ సభ్యులు అంటే… దానిని చంద్రబాబు మరో డ్రామాలా మార్చేశారని జగన్ విమర్శించారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని వాళ్లే ఏదో చేసుంటారని చెప్పారు. చంద్రబాబు మాటలు చూస్తే ఒక్కోసారి బాధకలుగుతుందని అన్నారు.
చంద్రబాబు విషయం జరుగుతున్న సమయంలో తాను సభలో లేనని… వర్షాలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నానని చెప్పారు. సభకు వచ్చిన తర్వాతే ఏం జరిగిందో తెలుసుకున్నానని చెప్పారు. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు. శాసనమండలిలో కూడా వారి బలం తగ్గిపోయిందని చెప్పారు.