- అసెంబ్లీ సమావేశాల రగడ
- తన అర్ధాంగిని అవమానిస్తూ మాట్లాడారన్న చంద్రబాబు
- మహిళలను కించపరిస్తే సీఎం జగన్ ఒప్పుకోరన్న బాలినేని
- తమ మంత్రులు ఒక్క మాట కూడా అనలేదని స్పష్టీకరణ
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తన అర్ధాంగి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దారుణంగా దూషించారని చంద్రబాబు ఆరోపించడంపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర అసహనంలో ఉన్న చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు.
భువనేశ్వరి తమకు సోదరి వంటిదని, ఆమె గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాము సహించబోమని స్పష్టం చేశారు. అలాంటిది తామే ఆమెను ఎందుకు దూషిస్తామని మంత్రి బాలినేని ప్రశ్నించారు. అసలు, అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడితే సీఎం జగన్ ఏమాత్రం సహించరని స్పష్టం చేశారు.
నిన్నటి సభా సమావేశాల్లో చంద్రబాబే వివేకా హత్య కేసు నేపథ్యంలో వైఎస్ కుటుంబీకులపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మంత్రులు భువనేశ్వరిని తిట్టారనడంలో వాస్తవం లేదని, వారు మాధవరెడ్డి, వంగవీటి రంగా హత్యల గురించి చర్చించాలని మాత్రమే అన్నారని బాలినేని వివరణ ఇచ్చారు.