చంద్రబాబు పై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సానుభూతి కోసమే ఇదంతా చేస్తున్నాడనే భావన తనకు కలిగిందన్నారు. అదేవిధంగా ఆనాడు జరిగిన విషయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనలపై ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలను.. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలను తాను పరిశీలించానని.. అయితే భువనేశ్వరి ప్రస్తావన తనకు వినబడలేదని నాదెండ్ల అన్నారు. చంద్రబాబు సానుభూతి కోసమే ఇదంతా చేస్తున్నాడనే భావన తనకు కలిగిందన్నారు.
చంద్రబాబు వల్ల చాలా మంది బాధలు పడ్డారని.. ఆ బాధలకు తిరిగి చెల్లించాలి కదా అని నాదెండ్ల అన్నారు. ‘చంద్రబాబు భార్యను అడ్డుపెట్టుకుని గతంలో సానుభూతి పొందాలని చూశారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే.. మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని ప్రగల్బాలు పలికారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు భార్యను అడ్డం పెట్టుకున్నాడు. చంద్రబాబును పార్టీలో చేర్చుకోకపోతే గర్భవతిగా ఉన్న తాను ప్రసవించనని నారా భువనేశ్వరి బెట్టు చేసింది. ఈ విషయం నాతో ఎన్టీఆర్ చెప్పారు. అందుకే చంద్రబాబును పార్టీలో చేర్చుకుంటున్నట్లు అని చెప్పారు..’ అంటూ ఆనాటి విషయాలను నాదెండ్ల గుర్తు చేసుకున్నారు.
రాజకీయ ఎత్తుగడలు వేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన దగ్గర వచ్చాడని.. అయితే పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయనను తెలుగుదేశంలో చేర్చుకునేందుకు సుముఖంగా లేరని అప్పట్లో జరిగిన విషయాలను చెప్పారు. ఎన్టీఆర్ తన బ్యాంకులో దాచుకున్న రూ.20 లక్షలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని నాదెండ్ల ఆరోపించారు.