పెట్రోల్ ను దాటేసిన టమాట రేటు.. ఏపీలో కిలో రూ.130
సగటున రూ.104కు అమ్ముతున్న వ్యాపారులు
వంటల్లో టమాట కోటాకు కోత
హోటళ్లలోనూ పక్కకు
రెండు నెలల్లో పది రెట్లు పెరిగిన ధరలు
భారీ వర్షాలతో తగ్గిన దిగుమతులు
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఒకప్పటి మాట ….నేడు కూరగాయల రేట్లు కొండెక్కాయి. ఏ కూరగాయను పట్టుకున్నా ధరలు షాక్ కొట్టేలా ఉన్నాయి. ప్రత్యేకించి టమాటా రేటు చెప్పాల్సిన పనిలేదు ..సీజన్ లో కిలో టమాటా రేటు కేవలం 5 రూపాయలు మాత్రమే ఉంటుండగా నేడు దాని ధర ఆకాశాన్ని తాకింది. కిలో ధర 130 పలుకుతుంది. దీంతో సామాన్యులకు టమాటా ధర అందుబాటులో లేదు … దానికి ప్రత్యాన్మాయం వెతుకుంటున్నారు. పేదవాడు టమాటాలు కొనడం మానేశాడు . టమాటా అధికంగా పండించే తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఈ విధంగా ఉంటె మిగతా ప్రాంతాల సంగతి ఏమిటి అనేది ఊహించుకోవచ్చు . టమాటా సీజన్ వచ్చే నాటికీ ధరలు అమాంతం తగ్గుముఖం పట్టి రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడం మార్కెట్ కు తెచ్చిన టమాటాలు రోడ్లపై పోసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేడు అదే టమాటా అందుబాటులో లేకపోవడంతో నిత్యం కూరల్లో వాడే వారు వాటిని ముట్టుకునేందుకు వెనుకాముందు ఆలోచన చేస్తున్నారు.
సామాన్యుడిని టమాట రేట్లు ఠారెత్తిస్తున్నాయి. వాటిని కొనాలంటేనే జనాలు జంకుతున్నారు. దీంతో చాలా మంది వంటల్లో టమాట కోటాను తగ్గించేశారు. హోటళ్లలోనూ కోతలు పెట్టేస్తున్నారు. టమాట వెరైటీలకు ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు. ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది. ఇవాళ ఉదయం నుంచి సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది. టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు టమాట చట్నీకి రాంరాం చెప్పారు.
పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు కొంటున్నారని వ్యాపారులు అంటున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం వరకు కిలో టమాట రూ.10 ఉండగా.. ఇప్పుడు ఏకంగా 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. భారీ వర్షాలు పడడం, ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు ఏర్పడడం వంటి కారణాలతో టమాటల రాక తగ్గిపోయింది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు వేరే కూరగాయల ధరలూ బాగా పెరిగాయి.