ఏపీ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు…పేదవాడి వైద్యానికి ప్రభుత్వం భరోసా : సీఎం జగన్
-మేం మనిషి ప్రాణానికి విలువవిస్తామన్న సీఎం జగన్
-ఏపీ అసెంబ్లీలో వైద్యం, ఆరోగ్యం శాఖ పై సీఎం జగన్ ప్రసంగం
-వైద్యం, ఆరోగ్యం అంశాల్లో ప్రభుత్వ విధానాలపై వివరణ
-వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చామని వెల్లడి
-పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు పొందవచ్చన్న సీఎం
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో నేడు సీఎం జగన్ ఆరోగ్యం, వైద్యం సంబంధింత అంశాలపై ప్రసంగించారు. వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. తమది మనిషి ప్రాణాలకు విలువనిచ్చే ప్రభుత్వం అని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ అనే పథకం తమను కాపాడుతుంది అని పేదల్లో భరోసా కలిగించేలా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆరోగ్య శ్రీ కిందికి వచ్చే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చయ్యే చికిత్సలను కూడా ఎక్కడా కోతలు పెట్టకుండా మానవీయ కోణంలో పథకం వర్తింపజేస్తున్నామని వివరించారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఖరీదైన బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్, బై కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్, హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైద్య ప్రక్రియలకు కూడా సాయం అందిస్తున్నామని తెలిపారు.
ఆరోగ్య శ్రీ ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచామని, రాష్ట్రంలో 90 శాతం మందికి దీన్ని వర్తింపజేస్తున్నామని వెల్లడించారు. వైద్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2,446 చికిత్సలను తీసుకువచ్చామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా పొరుగు రాష్ట్రాల్లోనూ సేవలు పొందే సౌలభ్యం కల్పించామని అన్నారు.
రాష్ట్రంలో గతంలో ఆసుపత్రులు ఎలా ఉన్నాయి… ఇప్పుడు ఆసుపత్రులు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని గమనించాలని సీఎం జగన్ సూచించారు. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నామని పేర్కొన్నారు. రూ.16,255 కోట్ల వ్యయంతో ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు చేపట్టామని, ఆరోగ్య శాఖలో 9,712 పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. 2022 ఫిబ్రవరి లోగా మరో 14,788 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.
ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని, దాంతో పార్లమెంటు స్థానం పరిధిలో ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు వీలు కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఓ బోధనాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.