కంచు కంఠం మూగబోయింది …మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు!
వైఎస్సార్ మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు
సుదీర్ఘకాలం ఏపీకి ఆర్థికమంత్రిగా పనిచేసిన వైనం
కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలు
కంచు కంఠం మూగబోయింది…మాజీముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఇకలేరు అనే చేదువార్త తెలుగు ప్రజలను విషాదం లో ముంచింది. ఆరడుగుల ఆజానుబాహుడు …పంచెకట్టు పైపంచె వేసే తీరు తెలుగు ధనం ఉట్టిపడేలా చేసింది. రాజకీయ దురంధరుడు ,సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రస్థానంలో ఎన్ని మజిలీలు …. ఆయన వయసు 88 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు.
4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.
రోశయ్య రాజకీయ ప్రస్థానం !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతుడైన , కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు రోశయ్య గుండెపోటుతో మృతి చెందటం తెలుగు ప్రజలను ఒక్కసారిగా విషాదంలో ముంచింది. సుదీర్ఘకాలం పాటు సేవలందించిన రోశయ్య అందరిలో విషాదాన్ని నింపుతూ వెళ్లిపోయారు. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలకు కట్టుబడి ఉండటం ఆయన గొప్పదనం. ఎక్కడ అవినీతి మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
గుంటూరు జిల్లాలోని వేమూరు (అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ)లో 1933 జులై 4న రోశయ్య జన్మించారు. హిందూ వైశ్య సామాజికవర్గంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. 1950లో శివలక్ష్మిని ఆయన పెళ్లాడారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ విద్యను అభ్యసించిన ఆయన… తనకు ఎంతో ఇష్టమైన ఆర్థికశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించడం విశేషం . చిన్నప్పటి నుంచి కూడా రోశయ్యలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గుంటూరులో చదువుతున్న సమయంలోనే ఆయన విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. రోశయ్యలో ఒక మంచి వక్త కూడా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా పేరుగాంచిన రోశయ్య రాజకీయ జీవితం ఆ పార్టీతో ప్రారంభం కాలేదు. తొలుత ఆయన స్వతంత్ర పార్టీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత ఆచార్య ఎన్జీ రంగా అంటే ఆయనకు అంతులేని అభిమానం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోశయ్య 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 1989, 2004 లో చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు 1998లో నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
సుదీర్థకాలం పాటు రాష్ట్ర ఆర్థికమంత్రిగా పని చేసిన అనుభవం రోశయ్య సొంతం. ఆర్థికమంత్రిగా 16 సార్లు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డిల హయాంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేశారు. అసెంబ్లీ లో ఆయన ప్రసంగాలు సందర్బోచితంగా చెణుకులు,ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవిగా ఉండేవి .
వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా రోశయ్య బాధ్యతలను స్వీకరించారు. ఏపీ 15వ ముఖ్యమంత్రిగా 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 24 వరకు బాధ్యతలను నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్ గా పని చేశారు.
1994 నుంచి 1996 వరకు ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా రోశయ్య వ్యవహరించారు. 1978-79లో శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. తన రాజకీయ జీవితంలో ఆర్ అండ్ బీ, హౌసింగ్, రవాణా, హోమ్, ఆర్థిక మంత్రి బాధ్యతలను నిర్వహించారు. ఆయన రాజకీయ జీవితం దాదాపు 60 ఏళ్ల పాటు కొనసాగింది. ఆంధ్ర యూనివర్శిటీ 2007లో ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. అజాతశత్రువైన రోశయ్య మృతి అందరినీ కలచివేస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలందరూ రోశయ్య మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
రోశయ్య మృతి పట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
రోశయ్య అనుభవం రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది: వెంకయ్యనాయుడు
రోశయ్య పలు పదవులకు వన్నె తెచ్చారు: కేసీఆర్
రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: జగన్
రోశయ్య మరణం దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
‘ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా శ్రీ రోశయ్య గారు అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్యనాయుడు అన్నారు.
రోశయ్య పలు పదవులకు వన్నె తెచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సౌమ్యుడిగా, సహన శీలిగా తనదైన శైలిని ప్రదర్శించారని తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటన చేశారు.
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిరంజీవి ,కేటీఆర్ ,కెవిపి రామచందర్ రావు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,ఎంపీ లు ఉత్తమకుమార్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు సంతాపం ప్రకటించారు.
సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ల సంతాపం
బహుముఖ ప్రజ్నశాలి ,రాజకీయ దురంధరుడు ,నిష్కళంక దేశభక్తుడు ,కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ లు తీవ్ర సంతాపం ప్రకటించారు.