Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇండోనేషియాలో అకస్మాత్తుగా అగ్నిపర్వతం బద్దలు.. 13 మంది మృతి.. జనం పరుగులు.. 

  • ఎగసిపడిన మౌంట్ సెమెరు
  • మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం
  • 11 గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు
  • వేడి ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యల నిలిపివేత
  • 4 కిలోమీటర్ల వరకు వ్యాపించిన బూడిద

ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఎలాంటి వార్నింగ్ లేకుండా అకస్మాత్తుగా నిప్పులు, పొగలు చిమ్ముతూ జావా దీవుల్లోని మౌంట్ సెమెరు ఎగిసిపడింది. ఊహించని ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. మరింత మంది చనిపోయి ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గాయపడిన 57 మందిలో 41 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.


ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి వేలాది మందిని విపత్తు స్పందన అధికారులు తరలించారు. తూర్పు జావాలోని లుమాజాంగ్ లో ఉన్న 11 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస శిబిరాలకు పంపించారు. వందలాది మంది ఇంకా మసీదులు, పాఠశాలల్లో తల దాచుకున్నారు. సెమెరు నుంచి వచ్చిన పొగ, లావా బూడిదతో ఊళ్లు నిండిపోయాయి. వేడికి తాళలేక చాలా వరకు పశువులు చనిపోయాయి. ఇళ్లన్నీ బూడిదమయమయ్యాయి. దాదాపు 4 కిలోమీటర్ల వరకు బూడిద వ్యాపించిందని అధికారులు చెప్పారు. 15 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిందని, విమానయాన సంస్థలు ఆ రూట్ ను తప్పిస్తే మంచిదని వోల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్ అధికారులు అలర్ట్ జారీ చేశారు.

అక్కడ ఉష్ణోగ్రత పెరగడం, వేడి ఎక్కువగా ఉండడంతో సహాయ చర్యలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. ఇక, ఇప్పటికే కురుస్తున్న జల్లులతో బూడిదతో కలిసి వరద నీరు వెల్లువలా వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. వర్షం పెరిగితే అది మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లుమాజాంగ్ లోని ఓ వంతెన దెబ్బతిన్నదని చెప్పారు.

సెమెరు ఉన్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ ఉండరాదని, అక్కడకు వెళ్లరాదని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పునరావాస శిబిరాలకు తిండి, టార్పాలిన్లు, ఫేస్ మాస్కులు, బాడీ బ్యాగులు, ఇతర అత్యవసరాలను పంపించినట్టు చెప్పారు.

Related posts

చంద్ర‌బాబు వేలికి ప్లాటినం ఉంగరం… దాని ప్ర‌త్యేక‌త‌లేమిటో చెప్పిన టీడీపీ అధినేత‌

Drukpadam

ఏపీ నుంచి బిశ్వభూషణ్ వెళ్లడం బాధాకరం: సీఎం జగన్

Drukpadam

5 హామీలిచ్చాం.. 2 గంటల్లో అమలు చేస్తాం: రాహుల్ గాంధీ

Drukpadam

Leave a Comment