నవ వధువు పడక గదిలో మద్యం బాటిళ్ల కోసం వెతికిన బీహార్ పోలీసులు!
ఐదు రోజుల క్రితమే అత్తారింట్లో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురు
పోలీసుల సోదాలతో స్పృహతప్పి పడిపోయిన అత్త
ఆమె అపస్మారకస్థితిలో ఉన్నా ఆగని సోదాలు
తలెత్తుకు తిరగలేకపోతున్నామన్న నవ వధువు
స్పందించేందుకు నిరాకరించిన ఎస్సెస్పీ
మద్యనిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో పోలీసుల చర్యలు ఇటీవల తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. అయినప్పటికీ వారి తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కొత్త పెళ్లికూతురు ఇంట్లోకి చొరబడిన పోలీసులు మద్యం సీసాలు ఉన్నాయంటూ తనిఖీలు చేయడంపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి హజీపూర్ నగరంలోని హత్సార్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇక్కడ నివసించే షీలాదేవి ఇంటికి వచ్చిన పోలీసులు నేరుగా ఆమె కోడలు పూజాకుమారి బెడ్రూములోకి వెళ్లి మద్యం సీసాల కోసం బీరువాలు, సూట్‌కేసులు, అల్మారాలు, డ్రాలు వెతికారు. నవ వధువు అయిన పూజాకుమారి ఐదు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చింది. పోలీసులు వచ్చి అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టడంతో భయపడిపోయిన షీలాకుమారి షాక్‌తో స్పృహ తప్పి పడిపోయారు.
మహిళా సిబ్బంది లేకుండానే పూజాకుమారి గదిలోకి వెళ్లి సోదాలు చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఎందుకు వెతుకుతున్నారో? దేని కోసం వెతుకుతున్నారో చెప్పాలని పోలీసులను అడిగినప్పటికీ వారు సమాధానం చెప్పలేదని, సైలెంట్‌గా ఉండాలని తనను హెచ్చరించారని పూజ ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి మద్యం సీసాల కోసం వెతుకుతున్నట్టు చెప్పడంతో షాకయ్యానని చెప్పారు.
తన అత్తయ్య స్పృహతప్పి పడిపోయినా పోలీసులు కనీస మానవత్వం చూపలేదని, ఆమె అపస్మారకస్థితిలో ఉన్నా వారు తనిఖీలు ఆపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత తాము తలెత్తుకుని తిరగలేకపోతున్నామని చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికీ మద్యం తాగే అలవాటు లేనప్పటికీ పోలీసులు మాత్రం ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా తనిఖీలు చేపట్టారని షీలాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా నవ వధువుల ఇళ్లలో మద్యం సీసాల కోసం పోలీసులు వెతకడం ఇదే తొలిసారి కాదు. పాట్నాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసుల తాజా చర్యపై మాట్లాడేందుకు వైశాలి ఎస్సెస్పీ మనీశ్ కుమార్ నిరాకరించారు. మహిళల కోరిక మేరకే రాష్ట్రంలో మద్య నిషేధం విధించామని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెబుతున్నారని కానీ, మళ్లీ మహిళల పడకగదుల్లో మద్యం సీసాల కోసం పోలీసులు వెతుకుతున్నారంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
రాష్ట్రంలో మద్య నిషేధం పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ దుమ్మెత్తి పోశారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి చోటా మద్యం దొరుకుతోందన్నారు. జితన్ రామ్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని అన్నారు.