మార్కెట్లో పతనం ఇంకెంత? నిపుణులు ఏమంటున్నారు?
- విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగొచ్చు
- 16,250 స్థాయిలో నిఫ్టీకి మద్దతు
- వచ్చే ఏడాది అనుకూలంగా ఉండొచ్చని అభిప్రాయాలు
ఈ రోజు నిఫ్టీ సుమారు 500 పాయింట్లు, సెన్సెక్స్ 1,500 పాయింట్లు పడిపోవడంతో రిటైల్ ఇన్వెస్టర్లలో ఆందోళన కనిపిస్తోంది. కానీ, మార్కెట్ పండితులు చెప్పినట్టు ‘అందరూ అమ్ముతున్నవేళ కొనుగోలు చేయాలని.. అందరూ కొనుగోళ్లకు ఉరకలు వేస్తున్న తరుణంలో విక్రయించుకోవాలనే’ సూత్రాన్ని అనుసరించాలా? లేక అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా వేచిచూసే ధోరణిని అనుసరించాలా? అన్న విషయమై మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
కరోనా ఒమిక్రాన్ కేసుల తీవ్రతతో ఆంక్షలపై భయాలు, లిక్విడిటీ తగ్గింపు, త్వరలోనే వడ్డీరేట్ల పెంపు బాటలో ఫెడ్ నడుస్తుండడంతో విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల వల్ల కీలక సూచీలు వాటి జీవనకాల గరిష్ఠాల నుంచి సుమారు 10 శాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు నెలరోజులుగా భారీగా అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ, భారీ నష్టాలను నిలువరించలేని పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో, ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాకుడు జి.చొక్కలింగం స్పందిస్తూ.. మార్కెట్ నిలదొక్కుకుని 2022 జనవరి నుంచి ర్యాలీ చేస్తుందన్నారు. మొత్తం మీద 2022లో 10-15 శాతం మేర రాబడిని ఇవ్వొచ్చన్న అంచనాని అయన వ్యక్తీకరించారు. కరోనా ఒమిక్రాన్ ఇప్పటి వరకు పెద్దగా తీవ్రత చూపించడం లేదు కనుక ప్రభుత్వాలు లాక్ డౌన్ ల జోలికి పోకపోవచ్చన్నారు.
‘‘స్వల్పకాలంలో ఈక్విటీలకు పెద్ద రిస్క్ ఉంది. అది కూడా వైరస్ పై టీకాల ప్రభావం పెద్దగా లేకుండా, ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగిపోయి, ఎక్కువ మంది ఆస్పత్రి పాలైతేనే. అటువంటప్పుడు ప్రపంచ సూచీలు 10శాతం వరకు నష్టపోవచ్చు’’ అని చొక్కలింగం పేర్కొన్నారు.
దేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికీ కొనుగోళ్ల బాటలోనే ఉన్నారని డైమన్షన్స్ కార్పొరేట్ ఫైనాన్స్ సర్వీసెస్ కు చెందిన అజయ్ శ్రీవాస్తవ అన్నారు. మూలాలతో సంబంధం లేకుండా.. డిమాండ్-సరఫరా మధ్య అంతరం కారణంగా మార్కెట్లు ఎక్కువగా పెరిగితే దిద్దుబాటు తప్పదన్నారు.
స్వల్పకాలంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతాయని ఆస్క్ సభర్వాల్ వ్యవస్థాపకుడు సందీప్ సభర్వాల్ తెలిపారు. నిఫ్టీ-50 200 రోజుల ఈఎంఏ 16,250 దగ్గర ఉందని, ఈ స్థాయిలో సూచీకి మద్దతు రావచ్చని, ఆ స్థాయిలో మార్కెట్ స్థిరపడొచ్చని సాంకేతిక నిపుణుడు, చార్ట్ వ్యూ ఇండియా డాట్ ఇన్ అధినేత మజర్ మహమ్మద్ వివరించారు.