ఒమిక్రాన్ పసిగట్టే సరికొత్త కిట్ రూపొందించిన ఐసీఎంఆర్!
-కిట్‌ను డిబ్రుగఢ్‌లోని ఐసీఎమ్ఆర్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది
-ఇంతవరకు ప్రపంచంలో ఇలాంటి కిట్ లేదు
-పేటంట్ హక్కులు మావే అంటున్న పరిశోధన కేంద్రం
ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను పసిగట్టేందుకు.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) సరికొత్త కిట్‌ను రూపొందించింది.
ఈ కిట్‌ను వాణిజ్యపరంగా వినియోగించేందుకు, కిట్లను సొంతంగా అభివృద్ధి చేసి, కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్ విట్రో డయొగ్నాస్టిక్స్ (ఐవీడీ) కిట్ తయారీదారుల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) కోసం ఆహ్వానించింది. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికత (రియల్ టైమ్ ఆర్టీపీసీఆర్ అస్సే), కిట్‌ను డిబ్రుగఢ్‌లోని ఐసీఎమ్ఆర్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై మేథో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. ఒప్పందం కుదుర్చున్న వారికి కిట్‌ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. దీంతో ఫలితాలు తేలేందుకు ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఐసీఎమ్ఆర్ తాజా ప్రకటన ఊరటనిచ్చే విషయం. కిట్‌ను ఉపయోగించి ఒమిక్రాన్‌ను వేగంగా గుర్తించినట్లయితే.. రోగికి మెరుగైన చికిత్స అందిస్తూనే, వైరస్ కట్టడికి చర్యలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.