ఇంటర్ బోర్డు ముందు జగ్గారెడ్డి దీక్ష…
-ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు నష్టపోయారు
-ఇంటర్ బోర్డు మొద్దు నిద్రపోతుంది…విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
-ఫెయిల్ అయినా విద్యార్థులకు న్యాయం చేయాలనీ డిమాండ్
-కరోనా మహమ్మారి వల్ల చదువులు సాగలేదు ..విద్యార్థులను పాస్ చేయండి
తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇంటర్ బోర్డు ముందు కార్యాలయం ముందు దీక్షకు కూర్చున్నారు .
ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపైనే ఆయన దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. తక్షణమే ఫెయిలైన విద్యార్థులకు కనీస మార్కులు వేసి పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కులను కలిపే పద్ధతిని అనుసరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కరోనా కారణంగా విద్యార్థులకు క్లాసులు జరగలేదని. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో వారు ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేకపోయారని జగ్గారెడ్డి ఆరోపించారు. 4.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తే 2.35 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని.. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన మండిపడ్డారు. విద్యావ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతోందని జగ్గారెడ్డి విమర్శలు చేశారు. అనేక మంది విద్యార్థులు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయారని మరింత మంది విద్యార్థులు చనిపోక ముందే వారికీ సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బోర్డ్ మొద్దు నిద్రపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలనీ అన్నారు.