రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్’:కేంద్ర హోమ్ శాఖ!
-అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ
-మాస్క్ తప్పని సరిగా ధరించాలి …సామజిక దూరం పాటించాలి
-బహిరంగ ప్రదేశాలలో రోడ్లపై ఉమ్మి వేయడం నిషేధించాలి
-నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలి
-కొత్త వేరియంట్ పై తప్పుడు సమాచారం మానుకోవాలి
-ఇందుకు అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించాలి
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పండగ వేళ.. రద్దీని నియంత్రించేందుకు అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పాటించాలన్న వ్యూహంలో నిర్లక్షంగా ఉండకూడదని లేఖలో సూచించింది హోంశాఖ. కరోనా నివారణ, నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని నిర్దేశించింది.
మాస్క్ ధరించాలని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో హోంశాఖ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. జిల్లా కలెక్టర్‌లు.. సూచనలను, నియమాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. సామాజిక దూరం పాటించేందుకు అవసరం అయితే.. 144 సెక్షన్‌ను ప్రయోగించాలని సూచించింది. విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. కొత్త వేరియంట్‌పై అపోహలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు.. అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది కేంద్రం.