నిర్మాతల సమస్యలు వేరు, ఏపీలో ఎగ్జిబిటర్ల సమస్యలు వేరు: దిల్ రాజు
త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తామన్న దిల్ రాజు
ఇండస్ట్రీ తరఫున కమిటీ వేశామని వెల్లడి
చిత్ర పరిశ్రమ పెద్దలు కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరణ
సినిమా వాళ్లు ఈ అంశాలపై మాట్లాడొద్దన్న దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు తాజా పరిణామాలపై స్పందించారు. నిర్మాతలుగా తమకు కొన్ని సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసిన తీరులోనే ఏపీ ప్రభుత్వం కూడా జీవో ఇస్తుందని భావిస్తున్నామని తెలిపారు. అయితే ఏపీలో ఎగ్జిబిటర్ల సమస్యలు వేరు, మా నిర్మాతల సమస్యలు వేరు అని స్పష్టం చేశారు. టికెట్ ధరలు ఒక్కటే కాకుండా, అనేక సమస్యలు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. ఏపీలోనూ తెలంగాణ తరహాలో ఐదో షోకి అనుమతి ఇవ్వాలని కోరతామని తెలిపారు.
త్వరలోనే సీఎం జగన్ ను, మంత్రులను కలిసి చర్చిస్తామని వెల్లడించారు. అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నామని అన్నారు. సినీ రంగ సమస్యలను సీఎం జగన్ కు నివేదించేందుకు చిత్ర పరిశ్రమ తరఫున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కమిటీలో ఇండస్ట్రీ పెద్దలు సభ్యులుగా ఉంటారని వివరించారు.
ఏపీ ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరపనున్నందున సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ ఆయా అంశాలపై మాట్లాడొద్దని దిల్ రాజ్ స్పష్టం చేశారు. మీడియా కూడా సంయమనం పాటిస్తూ తమకు సహకరించాలని కోరారు.