ఒమిక్రాన్ ఉప్పెనలా వ్యాపించనుంది: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్!
-ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి
-భారత్ లోనూ కలకలం
-ఇప్పటివరకు 1,200 పైచిలుకు ఒమిక్రాన్ కేసులు
-తేలిగ్గా తీసుకోరాదన్న సౌమ్య స్వామినాథన్
ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి సాధారణంగానే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో వెల్లువెత్తనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. మున్ముందు ఒమిక్రాన్ అమితవేగంతో వ్యాపించనుందని, చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. అదే జరిగితే, భారత్ మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పోటెత్తుతున్నాయని, నిన్నమొన్నటిదాకా అవుట్ పేషెంట్ చికిత్స సరిపోయిందని, ఇక ఐసీయూలకు తాకిడి పెరుగుతుందని సౌమ్య స్వామినాథన్ వివరించారు. అయితే, ప్రజలు ఒమిక్రాన్ వేరియంట్ ను ఓ సాధారణ జలుబులా తేలిగ్గా తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ వేరియంట్ గుణగణాలపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, దక్షిణాఫ్రికా నుంచి చాలా డేటా వస్తోందని అన్నారు. డెల్టా కంటే 4 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రభుత్వాలు దీనిపై సన్నద్ధతతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భారత్ లో ఇప్పటివరకు 1,200 పైచిలుకు ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక కేంద్రం ముంబయి నగరాల్లో కొత్త వేరియంట్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
బెంగళూరులో కరోనా విజృంభణ..
బెంగళూరు నగరంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద గురువారం 707 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇందులో 565 కేసులు బెంగళూరులో నమోదైనవే. రాష్ట్రం మొత్తం మీద యాక్టివ్ కేసుల సంఖ్య 8,223కు పెరిగింది. 47 రోజుల్లోనే ఇది గరిష్ఠ స్థాయి. ఇందులో 83 శాతం అంటే 6,846 కేసులు బెంగళూరులో ఉన్నాయి.
కేసులు కచ్చితంగా పెరుగుతున్నాయని బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు ప్రకటించారు. పరీక్షల సంఖ్యను పెంచినట్టు చెప్పారు. వచ్చే 10 రోజులు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని బీబీఎంపీ చీఫ్ హెల్త్ ఆఫీసర్ ఏఎస్ బాలసుందర్ తెలిపారు. యాక్టివ్ కేసుల్లో అధిక శాతం లక్షణాల్లేనివేనని చెప్పారు. ఐసీయూలో చేరే కేసుల సంఖ్యలో పెరుగుదల లేదని తెలిపారు. ఒక్క కొడగులో పరీక్షల సంఖ్యతో పోలిస్తే పాజిటివ్ రేటు 1 శాతం దాటిపోయింది.
‘‘మునుపటి పరిస్థితే మళ్లీ పునరావృతం కానుంది. 2020, 2021లో చూసినట్టుగానే వైరస్ బయోలాజికల్ సర్కాడియన్ సైకిల్ కనిపిస్తోంది. కనుక 2-3 నెలల్లో డెల్టా వేరియంట్ ను ఒమిక్రాన్ పూర్తిగా భర్తీ చేస్తుంది’’అని కోవిడ్ సాంకేతిక నిపుణుల కమిటీకి చెందిన డాక్టర్ సీఎన్ మంజునాథ్ పేర్కొన్నారు.