న్యూ ఇయర్ వేళ తీరని విషాదం.. వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి!
- జమ్మూకశ్మీర్‌లో ఘటన
- అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
- మరో 15 మందికి తీవ్ర గాయాలు
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
కొత్త సంవత్సరం వేళ జమ్మూకశ్మీర్‌లో తీరని విషాదం నెలకొంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె చెంతకే చేరారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయంలో ఈ ఘటన జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మృతులను ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను కాట్రా, కాక్రయల్ నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితుల చికిత్సకయ్యే ఖర్చును భరిస్తామని ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటించింది.
కాగా, తొలుత ఏడుగురు చనిపోయినట్టు వార్తలు రాగా, ఆ తర్వాత 12 మంది చనిపోయినట్టు నిర్ధారించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త సంవత్సరం రోజున భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వేలాదిగా తరలివస్తుంటారు. ఈసారి కూడా ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, తొక్కిసలాటపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.