సీఎం జగన్ సింహం లాంటి వాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ధర్మాన కృష్ణదాస్!
-ఎంతమంది కలిసినా ఏంచేయలేరు డిప్యూటీ సీఎం
-టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయని వెల్లడి
-సింహం వేటాడేస్తుందన్న ధర్మాన
-ఎన్ని జంతువులు కలిసినా ఏమీ కాదని వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో రానుండగా పొత్తులు ఎత్తులు , ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ రాజకీయ పరిస్థితులపై ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారని వైరి పక్షాలు ప్రచారం చేస్తుండగా మరో మూడు పర్యాయాలు జగన్ సీఎం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. అయితే, సీఎం జగన్ సింహం వంటి వాడని, ఎన్ని జంతువులు కలిసినా సింహాన్ని ఏమీ చేయలేవని అన్నారు. అలాగే, ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ కు ఏమీకాదని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల కోసం పలు పార్టీలు ఇప్పటినుంచే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి ఉద్దేశం మాత్రం నెరవేరదని ధర్మాన స్పష్టం చేశారు. సింహం రారాజు అని, సీఎం జగన్ కూడా ఓ సింహంలా ఈ దుష్ట శక్తులన్నింటిని వేటాడి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని వివరించారు. అలాంటి ముఖ్యమంత్రిని మనమందరం సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
ఇక తాము అమరావతి రాజధానిని మార్చడంలేదని, వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలోనూ, రాయలసీమలోనూ అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని ధర్మాన పేర్కొన్నారు.