ఆకాశం నుంచి చచ్చిన చేపల వర్షం!
- అమెరికాలో ఘటన
- టెక్సార్కానా పట్టణంలో టోర్నడో జలధార
- జలధార విలయం తర్వాత నేలపై చేపలు దర్శనం
- విస్మయానికి గురైన టెక్సార్కానా ప్రజలు
ఆకాశం నుంచి వర్షంతో పాటు కొన్ని సందర్భాల్లో చేపలు కూడా రాలి పడడం తెలిసిందే. అమెరికాలోని టెక్సార్కానా పట్టణంలోనూ ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. టెక్సార్కానా పట్టణం అటు టెక్సాస్, ఇటు ఆర్కాన్సాస్ రాష్ట్రాల భూభాగంలో విస్తరించి ఉంది. ఇటీవల ఈ పట్టణంలో భారీ టోర్నడో విలయం సృష్టించింది. ఆ టోర్నడో తీవ్రత ముగిసిన తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చిన ప్రజలు విస్మయానికి గురయ్యారు. బయట నేలపై అంతా చచ్చిన చేపలు పడి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు కొన్ని వేల సంఖ్యలో చేపలు దర్శనమిచ్చాయి.
టోర్నడోల కారణంగా ఏర్పడే జలధార కొన్ని సరస్సులు, చెరువులు మీదుగా ప్రయాణించేటప్పుడు అందులోని నీటిని మొత్తం ఖాళీ చేస్తుంటాయి. ఆ నీటితో పాటు చేపలు కూడా టోర్నడో జలధారతో పాటు ఆకాశానికి ఎగిసి, ఒక్కడో ఒక చోట పడిపోతుంటాయి. టెక్సార్కానా ప్రాంతంలో జరిగింది ఇదే.
వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు రాలిపడడాన్ని ఆ పట్టణ వాసులు కొందరు వింతగా భావించారు. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాధారణంగా ఇలాంటి చేపల వానలు ఎక్కువగా ఆస్ట్రేలియాలో పడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.