ఎన్నికలను నిర్వహించడానికి ఇదొక్కటే సురక్షిత మార్గం: ప్రశాంత్ కిశోర్
- ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
- కనీసం 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించాలన్న పీకే
- కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని వ్యాఖ్య
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ లలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల సమయానికి ఈ కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా ఇంకా ఎన్నికల తేదీలను ప్రకటించలేదు. దేశంలో కరోనా పరిస్థితిపై ఈసీకి నిన్న కేంద్రం వివరాలను అందించింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కనీసం 80 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించాలి. కేసులు పెరుగుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణకు ఇంతకంటే సురక్షిత మార్గం లేదు. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించకపోతే… ప్రక్రియ మొత్తం ప్రహసనంగా మారుతుంది’ అని పీకే అన్నారు.