Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ : సీఎం జగన్ ప్రకటన!

ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్… పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు: సీఎం జగన్ ప్రకటన!

  • ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ చర్చలు
  • అనంతరం కీలక ప్రకటన చేసిన సీఎం
  • అన్ని అంశాలను పరిశీలించామని వెల్లడి
  • పెంచిన జీతాలు జనవరి 1 నుంచి వర్తింపు
  • కొత్త పీఆర్సీ 2020 ఏప్రిల్ నుంచి వర్తింపు

ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కరోనా సంక్షోభం, ప్రతికూల పరిస్థితుల కారణంగా రాష్ట్రానికి రాబడి తగ్గిందని అన్నారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మంచి చేయాలనే తపనతోనే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నామని పేర్కొన్నారు.

ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఫిట్ మెంట్ 14.29 శాతం కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ చెప్పినా, తాము అన్నివర్గాలకు ఉపయుక్తమైన నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి వర్తిస్తాయని వివరించారు. పెండింగ్ డీఏలు జనవరి జీతంతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపు చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల భారం పడనుందని వెల్లడించారు.

ఇక, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఈ నియామకాలు జూన్ 30 లోపు పూర్తిచేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మకు స్పష్టం చేశారు. అటు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జూన్ 30 లోపు ప్రొబేషన్, కన్ఫర్మేషన్ డిక్లేర్ చేస్తామని చెప్పారు. జూలై నుంచి వారు సవరించిన జీతాలు అందుకుంటారని తెలిపారు.

సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న టౌన్ షిప్పుల్లో 10 శాతం ప్లాట్లను రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు. 20 శాతం రిబేటుతో జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డు సమస్యను రెండు వారాల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Related posts

కరోనా కట్టడిలో కోర్టు వ్యాఖ్యలు మోదీ, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ద్వజం

Drukpadam

ప్రమాదంలో 186 అమెరికా బ్యాంకులు..!

Drukpadam

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్వర్క్ తీసుకువస్తున్నాం: ముఖేశ్ అంబానీ

Drukpadam

Leave a Comment