మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు హరీశ్ రావు కౌంటర్!
- శివరాజ్ సింగ్ అవాకులు, చెవాకులు మాట్లాడారు
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన చరిత్ర ఆయనది
- వ్యాపం కుంభకోణంలో ఒక్కరికైనా శిక్ష పడిందా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అంశంపై ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేయిస్తారా? అని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి పిరికి సీఎంని ఎక్కడా చూడలేదని చెప్పారు. కేసీఆర్ రెండు సార్లు మాత్రమే సీఎం అని… తాను నాలుగు సార్లు సీఎంనని… కానీ కేసీఆర్ లా ఎప్పుడూ సంస్కారహీనంగా ప్రవర్తించలేదని అన్నారు. శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.
శివరాజ్ సింగ్ అవాకులు, చెవాకులు మాట్లాడారని అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తాను శాకాహారి నన్నట్లుగా ఆయన వ్యవహారం ఉందని చెప్పారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని సీఎం అయిన చరిత్ర ఆయనదని విమర్శించారు. గత నాలుగేళ్లుగా సీఎంగా ఉండి మీ రాష్ట్రానికి చేసిందేమని ప్రశ్నించారు.
అసలు తెలంగాణతో మీ రాష్ట్రానికి పోలిక ఏమిటని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ లో జరిగిన ‘వ్యాపం’ కుంభకోణంలో ఇప్పటి వరకు ఎవరికైనా శిక్ష పడిందా? అని ప్రశ్నించారు. ఆ కుంభకోణంతో మీ కుటుంబానికి, మీ పార్టీ నేతలకు సంబంధం ఉందనే ఆరోపణలు కూడా వచ్చాయని దెప్పిపొడిచారు.