నాగ్‌పూర్ ఆరెస్సెస్ కార్యాలయం వద్ద రెక్కీ కేసు.. నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్!
- ఆరెస్సెస్ కార్యాలయం సహా నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో రెక్కీ
- ఉగ్రవాదులు పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్‌కు చెందినవారు
- ఓ యువకుడిని విచారిస్తున్న సమయంలో రెక్కీ విషయం వెలుగులోకి
నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్స్ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ కేసులో నలుగురు ఉగ్రవాదులను సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సంఘ్ కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు నగరంలో హైఅలెర్ట్ ప్రకటించి ఉగ్రవాదుల కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరెస్సెస్ కార్యాలయంతోపాటు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో వీరు రెక్కీ నిర్వహించినట్టు పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో నాగ్‌పూర్‌లో రెక్కీ విషయం బయటపడిందని సీపీ తెలిపారు. అతడు ఇచ్చిన ఆధారంతోనే మరో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.