కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే: మంత్రి హరీశ్ రావు!
- ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తాం
- వారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను ఇస్తాం
- చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ, ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తామని, జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చేసిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఆ సమయంలో తమ ప్రభుత్వ పనితీరును నీతి ఆయోగ్ ప్రశంసించిందని చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా థర్డ్ వేవ్ లో కొంత మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని హరీశ్ అన్నారు. చాలా మంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని… అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి పరీక్షలను చేపడుతోందని చెప్పారు.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు సిద్ధం చేశామని తెలిపారు. వీటిని గ్రామ స్థాయి వరకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని తెలిపారు. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించుకున్నామని చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటే దగ్గర్లోని బస్తీ దవాఖానా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే హోం ఐసొలేషన్ కిట్ ఇస్తారని తెలిపారు.