Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రసకందాయంలో గోవా బీజేపీ…

రసకందాయంలో గోవా: బీజేపీ తొలి జాబితాలో మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడికి మొండిచేయి

ప్రత్యామ్నాయంగా మరో రెండు స్థానాలు ప్రతిపాదించిన బీజేపీ

తండ్రి స్థానాన్ని సెంటిమెంటుగా భావిస్తున్న ఉత్పల్‘ఆప్’లోకి ఆహ్వానించిన కేజ్రీవాల్

స్వతంత్రంగా బరిలోకి దిగితే మద్దతిస్తామన్న శివసేన

సంకుచిత ప్రయోజనాల కోసం ఉత్పల్ పార్టీ మారబోరన్న బీజేపీ

గోవా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరిగా చెలామణి అయిన దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు బీజేపీ మొండిచేయి చూపింది. గోవా అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిన్న 34 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితాను విడుదల చేసింది.

తన తండ్రి స్థానమైన పనాజీ (పాంజిమ్) నుంచి తాను బరిలోకి దిగాలని కోరుకుంటున్నట్టు ఉత్పల్ పారికర్ ఇదివరకే బహిరంగంగా ప్రకటించారు. అయితే, బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అటనాసియో ‘బాబుష్’ మాన్సెరటెకే ఆ టికెట్ కేటాయించింది.

తనకు టికెట్ నిరాకరించిన బీజేపీపై గుర్రుగా ఉన్న ఉత్పల్ పారికర్ పనాజీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ప్రత్యామ్నాయంగా మరో రెండు స్థానాలను చూపిస్తూ బీజేపీ తీసుకొచ్చిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించినట్టు సమాచారం. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఉత్పల్ విలేకరులకు తెలిపారు.

బీజేపీ గోవా వ్యవహారాల బాధ్యుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయమై మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం వల్లే ఉత్పల్‌కు పనాజీ సీటు కేటాయించలేకపోయామని, ప్రత్యామ్నాయంగా మరో రెండు సీట్లు కేటాయించినట్టు చెప్పారు. వాటిని ఆయన అంగీకరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఉత్పల్ మాత్రం తన తండ్రి పోటీ చేసిన స్థానాన్ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పనాజీ తప్ప వేరే స్థానం నుంచి ఆయన పోటీ చేయబోరని వారు స్పష్టం చేశారు.

ఉత్పల్‌కు బీజేపీ మొండిచేయి చూపడంతో ప్రతిపక్షాలు వెంటనే రంగంలోకి దిగిపోయాయి. ఉత్పల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఢిల్లీ సీఎం, ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇదే విషయమై శివసేన స్పందిస్తూ ఉత్పల్ కనుక స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే మద్దతిస్తామని ప్రకటించింది.

ప్రతిపక్షాల ఆఫర్లపై స్పందించిన బీజేపీ.. సంకుచిత ప్రయోజనాల కోసం ఉత్పల్ పారికర్ పార్టీకి ద్రోహం చేయరని భావిస్తున్నట్టు పేర్కొంది. పారికర్‌కు ‘ఆప్’లో భవిష్యత్ ఉండదని, బీజేపీ ఆయన సొంతిల్లు అని పేర్కొంది. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు. 2019లో మృతి చెందారు.

Related posts

బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్‌లో కానీ చేరితే పది రోజుల్లోనే బెయిలు వస్తుందన్నారు: అఖిల్ గొగొయ్ సంచలన ఆరోపణ!

Drukpadam

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

Drukpadam

టీఆర్ఎస్ నేతలెవరూ మీడియాతో మాట్లాడొద్దు: కేటీఆర్

Drukpadam

Leave a Comment