తెలంగాణలో ఫీవర్ సర్వే..ఒక్కరోజుల్లోనే 45,567 మందిలో లక్షణాలు గుర్తింపు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది.
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను చేపట్టారు అధికారులు. శుక్రవారం (జనవరి 21) నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోంది. తెలంగాణలోని అన్నీ జిల్లాలోని వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి, హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు.
ఒక్కరోజు ఫీవర్ సర్వే లోనే 45వేల 567 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఏదొక లక్షణాలతో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితోపాటు ఏదొక లక్షణాలతో బాధ పడుతున్న వారి సంఖ్య 45,567 మందిగా గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేశారు. ఇంటింటి ఫీవర్ సర్వేలో చిన్నారులు, పెద్దవారిని విడివిడిగా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలు గుర్తించారు.
కోవిడ్ తీవ్ర లక్షణాలు ఉంటే టెస్ట్ చేసి 5రోజుల పాటు బాధితులను సిబ్బంది ఫాలో అప్ చేస్తున్నారు. లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటే వైద్య సిబ్బంది కరోనా బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఫీవర్ సర్వే మరో 6 రోజులపాటు కొనసాగనుంది. మొన్నటివరకూ టెస్టింగ్ సెంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఇప్పుడు ఇంటింటికి ఆరోగ్య శాఖ సిబ్బంది వెళ్లడంతో టెస్టింగ్ సెంటర్స్ వద్ద రద్దీ తగ్గుతోంది. శుక్రవారం హెల్త్ బులిటెన్‌లో 4వేల 416 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.