Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కరోనా మహమ్మారి అంతమవుతుందని అనుకోవద్దు.. మరిన్ని వేరియంట్లు పుడతాయి: డబ్ల్యూహెచ్ వో

కరోనా మహమ్మారి అంతమవుతుందని అనుకోవద్దు.. మరిన్ని వేరియంట్లు పుడతాయి: డబ్ల్యూహెచ్ వో

  • గత వారం ప్రతి మూడు క్షణాలకు సగటున వంద కేసులు
  • ప్రతి 12 సెకన్లకో కరోనా మరణం నమోదు
  • ఒమిక్రానే చివరి వేరియంట్ అనుకోవడం ప్రమాదకరం
  • కేసులు ఎక్కువొస్తున్న దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టే ప్రమాదం

కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమవుతుందన్న ఆలోచనలు సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ సూచించారు. మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. డబ్ల్యూహెచ్ వో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒమిక్రాన్ ను గుర్తించిన 9 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. కొత్త వేరియంట్ కేసుల సంఖ్య.. 2020లో నమోదైన మొత్తం కేసుల కన్నా ఎక్కువని చెప్పారు.

గత వారం సగటున ప్రతి మూడు క్షణాలకు 100 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి 12 సెకన్లకు ఓ ప్రాణం కరోనాకు బలైందన్నారు. కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా.. మరణాలు మాత్రం అంతగా లేవని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్లు ఇంకా అందని ఆఫ్రికా వంటి దేశాల్లో మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒమిక్రానే చివరి వేరియంట్ అని అనుకోవడం చాలా ప్రమాదకరమైన సంకేతమని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు.. కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. కరోనాను నియంత్రించాలంటే.. దాని తీవ్రతకు ఏర్పడిన పరిస్థితులను మార్చాలని సూచించారు. మహమ్మారి వైరస్ ఎప్పుడు..ఎలా మారుతోందో అంచనా వేయడం కష్టమని టెడ్రోస్ అన్నారు.

ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే, చాలా దేశాల్లో ఇంకా వేరియంట్ వ్యాప్తి ప్రబలంగానే ఉందని తెలిపారు. కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లోనే కొత్త వేరియంట్లు ఉద్భవించే ముప్పుందని ఆయన హెచ్చరించారు. అయితే, సరైన చర్యలు తీసుకుంటే ఈ ఏడాదే మహమ్మారిని అంత్యదశకు తీసుకురావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అన్ని దేశాలూ డబ్ల్యూహెచ్ వో వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అన్ని దేశాల్లో కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆక్సిజన్, యాంటీ వైరల్ ఔషధాలను అందరికీ సమానంగా అందించాలన్నారు.

Related posts

ఒమిక్రాన్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది…కఠిన నిర్ణయాలు తప్పనిసరి: డ‌బ్ల్యూహెచ్‌వో!

Drukpadam

లాక్‌ డౌన్‌కు వ్యతిరేకంగా చైనాలో ఆగ్రహ జ్వాలలు..

Drukpadam

కరోనా మల్లి డేంజర్ బెల్స్ …తస్మాత్ జాగ్రత్త :ప్రపంచ ఆరోగ్య సంస్థ…

Drukpadam

Leave a Comment