డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరయ్యాడని అన్నాడీఎంకే ఎంపీపై వేటు!
- డీఎంకే ఎంపీ ఇళంగోవన్ కుమార్తె ధరణి వివాహం
- పెళ్లిలో సీఎం స్టాలిన్ తో ముచ్చటించిన ఎంపీ నవనీతకృష్ణన్
- క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అన్నాడీఎంకే
- న్యాయవిభాగం కార్యదర్శిగా తొలగింపు
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. డీఎంకే నేత కుమార్తె పెళ్లికి వెళ్లినందుకు ఓ అన్నాడీఎంకే ఎంపీపై వేటు పడింది. ఇటీవల డీఎంకే రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రచార కార్యదర్శి ఇళంగోవన్, నళిని దంపతుల కుమార్తె ధరణి వివాహం ఘనంగా జరిగింది. డీఎంకే పార్టీ హెడ్ క్వార్టర్స్ లోని అన్నా అరివాలయం కలైజ్ఞర్ ఆడిటోరియంలో ఈ పెళ్లి జరిగింది.
అయితే ఈ వివాహ వేడుకకు అన్నాడీఎంకే ఎంపీ, పార్టీ న్యాయవిభాగం కార్యదర్శి నవనీతకృష్ణన్ కూడా హాజరయ్యారు. అంతేకాదు, ఆ పెళ్లికి వచ్చిన సీఎం స్టాలిన్ తోనూ ముచ్చటించారు. అసలే ప్రత్యర్థి పార్టీ… ఆపై సీఎంతో మాటామంతీ..! ఇంకేముంది… ఎంపీ నవనీతకృష్ణన్ పై అన్నాడీఎంకే వర్గాలు భగ్గుమన్నాయి.
పార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వం, సహ సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి దీనిపై చర్చించి పార్టీ న్యాయవిభాగం కార్యదర్శి పదవి నుంచి నవనీతకృష్ణన్ ను తప్పిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, డీఎంకే ఓ దుష్టశక్తి అని గతంలో ఎంజీఆర్ అన్నారని, అలాంటి పార్టీకి చెందినవారితో మాట్లాడడం ద్వారా నవనీతకృష్ణన్ పార్టీ సిద్ధాంతాలు ఉల్లంఘించాడని అన్నాడీఎంకే వర్గాలు అభిప్రాయపడ్డాయి.